రైతుకు క‘న్నీటి’ కష్టం! | Sakshi
Sakshi News home page

రైతుకు క‘న్నీటి’ కష్టం!

Published Tue, Mar 26 2024 1:05 AM

జాజిరెడ్డిగూడెం మండలంలో ఎండిపోతున్న వరిపొలాలు
 - Sakshi

అర్వపల్లి: శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) రెండో దశ ఆయకట్టు రైతులకు కన్నీటి కష్టాలు వచ్చాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌లో చేతికొచ్చిన వరిపొలాలు గోదావరి జలాలు అందక నిలువునా ఎండిపోతుండడంతో కర్షకులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. శ్రీరామా కరుణించవా అంటూ.. రైతులు గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్నారు. పొట్టదశలో ఉన్న పంటపొలాలు నీళ్లురాకపోవడంతో మాడిపోతున్నాయని, తమ బాధను ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆయకట్టులో 1.50లక్షల ఎకరాల్లో సాగు

జిల్లా వ్యాప్తంగా ఎస్సారెస్పీ రెండో దశ కింద ఈ యాసంగి సీజన్‌లో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో వరిపంటను సాగు చేశారు. అయితే, నీటి పారుదల శాఖ అధికారులు ఈ సీజన్‌లో జనవరి 8నుంచి ఈ నెల 30వరకు ఆరు విడతల్లో (ఆరు తడులుగా) జిల్లాకు సాగునీటిని విడుదల చేస్తామని ముందస్తుగా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం నీరు విడుదల చేస్తున్నప్పటికీ గతంలో కన్నా నీటిని తగ్గించడం, తక్కువ రోజులు వదిలారు. వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తామని ప్రకటించినా కొన్ని వారాలు వారం పాటు ఇవ్వకుండా నాలుగైదు రోజులు మాత్రమే నీటిని వదిలారు. దీంతో ఆయకట్టులో సాగు చేసిన వరిపొలాలు ఎండిపోతున్నాయని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

చివరి విడత కూడా ఇవ్వకుండా..

నీటిపారుదల శాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం వారబందీ విధానంలో ఆరో విడతగా (ఆరో తడి) ఈనెల 23 నుంచి 30 వరకు నీళ్లు వదలాల్సి ఉంది. అయితే నాలుగు రోజులు కావస్తున్నా ఇంతవరకు నీటిని వదలలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎస్సారెస్పీ రెండో దశ కింద సాగవుతున్న వరి పొలాలు ఎక్కడికక్కడ నీరు లేక బీటలు వారుతున్నాయి. ఇప్పటికే నీళ్లు అనుకున్న ప్రకారం రాక చివరి భూములకు నీళ్లు అందకపోవడంతో సుమారు 15వేల ఎకరాలకుపైగా వరిపంట ఎండిపోయి పశువులకు మేతగా మారాయి. ఈ చివరి విడత నీళ్లు రాకపోతే సగానికి పైగానే వరిపంట పూర్తిగా ఎండిపోతుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వారం పాటు నీళ్లిస్తే వరిపంట చేతికొస్తుందని, తిండిగింజలైన దక్కుతాయని రైతులు అంటున్నారు.

గోదావరి జలాలపైనే ఆధారపడి..

గోదావరి జలాలపైనే ఆధారపడి 5 ఎకరాల వరిపంట సాగుచేశా. కొన్నేళ్లుగా ఈ నీటితోనే వరిపంట పండిస్తున్నా. ఎస్సారెస్పీ 71 డీబీఎం కాలువ వెంట పొలం ఉన్నా ఈసారి సరిగా నీళ్లురాక వరిపంట ఎండిపోతుంది. షెడ్యూల్‌ ప్రకారం ఆరో తడి నీళ్లు ఇంత వరకు రాలేదు. ఈ చివరి విడత నీటిని వదిలి వరి పంటలను కాపాడాలి.

– కడారి నరేష్‌, రైతు అర్వపల్లి

ఒకటి రెండు

రోజుల్లో నీళ్లు వస్తాయి

ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ఈసారి నీళ్లు తక్కువగా వదులుతున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చివరి తడి నీటి విడుదల ఒకటి రెండు రోజుల్లో జరుగుతుంది. ఈ నీటి కోసం ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ రేయింబవళ్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం.

– ఎం.సత్యనారాయణ, బయ్యన్నవాగు డీఈఈ

ఫ ఎండుతున్న ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టు

ఫ 23నుంచి రావాల్సిన ఆరో విడత నీళ్ల ఊసేలేదు

ఫ చివరి విడత నీటి కోసం తప్పని నిరీక్షణ

ఫ శ్రీరామా దయచూపవా అని వేడుకుంటున్న రైతులు

1/2

2/2

Advertisement
Advertisement