ఆటోనగర్‌కు మోక్షం లభించేనా! | Sakshi
Sakshi News home page

ఆటోనగర్‌కు మోక్షం లభించేనా!

Published Sat, Mar 23 2024 1:15 AM

ఇమాంపేటలో ప్రభుత్వ భూమినిపరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటరావు (ఫైల్‌) - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట): సూర్యాపేట పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆటోనగర్‌, ఇండస్ట్రియల్‌ పార్కుకు ఇప్పట్లో మోక్షం కలిగేలా కనిపించడం లేదు. ఏళ్ల కాలం నుంచి కలగా ఉన్న ఆటోనగర్‌, ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు 2023 ఆగస్టులో అడుగులు పడ్డాయి. ముందుగా ఆటోనగర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయగా, ఇండస్ట్రియల్‌ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ నేటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు ఒక్క అడుగుకూడా ముందుకు సాగలేదు.

102 ఎకరాల్లో..

జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సూర్యాపేట రూరల్‌ మండలం ఇమాంపేటలో ఆటోనగర్‌ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 2023 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. సుమారు 102 ఎకరాల్లో ఆటోనగర్‌, ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించి 33.24 ఎకరాల భూమి సేకరించారు. ఈ భూమి తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు. ఇంకా 69.16 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ల్యాండ్‌ ఎక్విజేషన్‌ చేయాలని నిర్ణయించారు. ఇండస్ట్రియల్‌ పార్కు, ఆటోనగర్‌ ఏర్పాటుకు రూ.16కోట్ల నిధులు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసి అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆటోనగర్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రి, కార్మిక సంక్షేమ భవనం, ప్రధాన రహదారి నుంచి చివరి వరకు విశాలమైన రోడ్లు, కమాన్‌న్‌ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ రెండు ప్రతిపాదనలు ఒకేచోట ఉండడంతో ఉపాధికి కేరాఫ్‌గా ఇమాంపేట మారతుందని అందరూ భావించారు. అయితే కొన్ని రోజులు అధికారులు హడావుడి చేసి తరువాత పట్టించుకోలేదు. ఇది పూర్తయితే దాదాపు 10వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

ఏళ్ల కల నెరవేరేదెప్పుడు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సూర్యాపేట అతిపెద్ద పట్టణం. అంతేకాకుండా పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండడంతో వ్యాపారపరంగా కూడా అగ్రగామిగా మారింది. ఇక్కడ దాదాపు నాలుగైదు దశాబ్దాల నుంచి చిన్న, పెద్ద వాహనాలు భారీగా ఉండగా మెకానిక్‌లు సైతం అదే స్థాయిలో జీవనోపాధి పొందుతున్నారు. దాంతో ఏళ్లుగా మెకానిక్‌లు ఇక్కడ ఆటోనగర్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. అంతే కాకుండా ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటైతే వేలాది మందికి స్వయం ఉపాధి దొరికేది. గత ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఇండస్ట్రియల్‌ పార్కు, ఆటోనగర్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినా ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

ఫ ఇమాంపేటలో శంకుస్థాపన

చేసిన గత ప్రభుత్వం

ఫ ప్రతిపాదనల వద్దే ఇండస్ట్రియల్‌ పార్కు

ఫ నేటికీ మొదలుకాని పనులు

ఫ ఇవి పూర్తయితే 10వేల మందికి

ఉపాధి అవకాశం

ఫ ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షణ

Advertisement
Advertisement