No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, Apr 17 2024 12:15 AM

- - Sakshi

కావలి/జలదంకి: జలదంకి మండలం చామదలకు చెందిన దావులూరి శ్రీనివాసులు (51) హైదరాబా ద్‌లో సిమెంట్‌ వ్యాపారం చేస్తున్నాడు. కుటుంబంతో సహా అక్కడే స్థిర పడ్డాడు. శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో భార్య వరలక్ష్మి (45), వదిన లక్ష్మమ్మ (48), కుమార్తె నీలిమ (24), మనుమడు నందు (2)తో కలిసి సొంతూరికి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసుకుని షాపింగ్‌ నిమిత్తం కారులో కావలికి బయలుదేరారు. దావులూరి శ్రీనివాసులు కారు డ్రైవ్‌ చేస్తున్నాడు. ముందు సీట్లో భార్య వరలక్ష్మి, వెనుక సీట్లో వదిన లక్ష్మమ్మ, కుమార్తె నీలిమ, మనుమడు నందు కూర్చున్నారు. చామదల నుంచి కావలికి చేరుకునేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. బ్రాహ్మణక్రాక, తొమ్మిదో మైలు, జలదంకి మీదుగా కావలి చేరుకోవచ్చు. మరో మార్గంలో తాళ్లూరు, బోగోలు మీదుగా చైన్నె–కోల్‌కత్తా హైవేకు చేరుకోవచ్చు. దగ్గరగా ఉంటుందని, ట్రాఫిక్‌ సమస్య ఉండదని తాళ్లూరు మీదుగా కొండబిట్రగుంట నుంచి చైన్నె–కోల్‌కత్తా హైవేలోకి వచ్చారు. కారు హైవే ఎక్కిన వెంటనే వేగాన్ని బాగా పెంచాడు. అక్కడి నుంచి అర కిలోమీటరు దూరంలోనే శివకాశి నుంచి జార్ఖండ్‌కు అగ్గిపెట్టెల లోడుతో వెళుతున్న లారీ రోడ్డు మార్జిన్‌లోనే ఆగి ఉంది. ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్‌లో ఆగి ఉన్న అగ్గిపెట్టెల లారీని రెప్పపాటు వ్యవధిలోనే కారు ఢీకొట్టింది. కారు వేగానికి లారీ కిందకు దూసుకుపోవడంతో అందులోని ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారు ముందు భాగంతో పాటు మృతదేహాలు కూడా లారీ కింద ఇరుక్కుపోవడంతో ఘటనా స్థలం భీతావహంగా మారింది. కావలి రూరల్‌ సీఐ కే శ్రీనివాసరావు, కావలి డీఎస్పీ వెంకటరమణ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కావలి రూరల్‌ పోలీసులు లారీ కింది భాగంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కావలి రెడ్‌క్రాస్‌ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఈ మేరకు కావలి రూరల్‌ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉలికి పడిన చామదల

ప్రమాద విషయం తెలిసిన వెంటనే చామదల ఉలికి పడింది. హైదరాబాద్‌ నుంచి వచ్చి అప్పటి వరకు అందరితో సరదాగా గడిపిన వాళ్లు అంతలోనే విగతజీవులుగా మారారనే విషయం గ్రామాన్ని కుదిపేసింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుప్ప కూలిపోయారు. కొన్ని నిమిషాల ముందు వరకు తమ కళ్లముందే ఉన్న వాళ్లు అంతలోనే మృతువాత పడటాన్ని జీ ర్ణించుకోలేకపోయారు. రెండేళ్ల చిన్నారి సహా అందరూ మృత్యువాత పడడంతో చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.

మృత్యు ఘంటికలు

మోగిస్తున్న లారీలు

హైవేపై ఆగి ఉన్న లారీలు నిత్యం మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. కావలి మండలం రుద్రకోట నుంచి దగదర్తి మండలం సున్నపుబట్టీ వరకు హైవేకు ఇరు వైపులా లారీలు ఇష్టం వచ్చినట్లు నిలిపేస్తున్నారు. ముఖ్యంగా దాబా హోటళ్లు, టిఫిన్‌ అంగళ్లు, కూడళ్ల వద్ద రోడ్డు మార్జిన్‌లోనే నిలుపుతున్న లారీల కారణంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Advertisement
Advertisement