షూస్‌ కొనే స్థోమత లేదు సాయం చేయండి: క్రికెటర్‌ ఆవేదన

 Zimbabwe Cricketer Emotional Tweet We Glue Our Shoes After Every Series - Sakshi

''మేము చాలా దయనీయ స్థితిలో ఉన్నాం..  సిరీస్‌ ముగిసిన ప్రతీసారి విరిగిపోయిన మా షూస్‌కు గ్లూ రాసుకొని వాటిని కాసేపు ఎండబెడుతున్నాం..  ఆ తర్వాతి మ్యాచ్‌లకు మళ్లీ అవే షూతో సిద్ధమవుతున్నాం. ఇలా కొన్ని నెలలు పాటు చేస్తూనే ఉన్నాం. కనీసం షూ కొనే స్థోమత కూడా లేదు... ఎవరైనా స్పాన్సర్‌ ఉంటే సాయం చేయండి.. అప్పుడు మా షూస్‌కు గ్లూ పెట్టే అవసరం రాదు.'' ఇది జింబాబ్వే క్రికెటర్‌ ర్యాన్ బర్ల్ ఆవేదన. ఈ ఒక్క అంశం చాలు జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ఎంత దయనీయ స్థితిలో ఉందో చెప్పడానికి. అయితే ర్యాన్ బర్ల్ పోస్టుకు స్పందించిన స్పోర్ట్స్‌ కంపెనీ పూమా షూస్‌.. అతనితో ఒప్పందం చేసుకోవడమే గాక జింబాబ్వే ఆటగాళ్లకు షూస్‌ను గిఫ్ట్‌గా పంపి తన ఉదారతను చాటుకుంది.

ర్యాన్ బర్ల్ కన్నీటిపర్యంతమవుతూ పెట్టిన పోస్ట్‌ సగటు క్రికెట్‌ అభిమానులను కదిలిచింది. దీన స్థితిలో ఉన్న జింబాబ్వే క్రికెటర్లకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.'' బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా మీకు ఒక విజ్ఞప్తి.. దయచేసి జింబాబ్వేతో సిరీస్‌లు ఉంటే పోస్ట్‌పోన్‌ చేయకండి. ఇప్పుడు వారితో క్రికెట్‌ ఆడితే వచ్చే డబ్బు వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కచ్చితంగా జింబాబ్వే మంచి టీమ్‌.. కానీ అక్కడి కుళ్లు రాజకీయాలు క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తున్నాయి.జింబాబ్వేతో సిరీస్‌లు ఆడుతూ వారికి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది.'' ఒక అభిమాని ఆవేదన చెందాడు. ''జింబాబ్వే ఆటగాళ్ల పరిస్థితి చూసి బాధేస్తోంది. క్రికెట్‌లో కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం అవసరం పడుతుందేమో. జెంటిల్మెన్‌ ఆటగా పిలుచుకునే క్రికెట్‌లో ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడాలి. దయనీయ స్థితిలో ఉన్న జింబాబ్వే క్రికెటర్లను ఆదుకోవాలి'' అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. ర్యాన్ బర్ల్ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. మరి ఐసీసీతో పాటు బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్‌ బోర్డులు బర్ల్ పోస్టుకు స్పందిస్తాయేమో చూడాలి.జింబాబ్వే తరపున 2017లో అరంగేట్రం చేసిన ర్యాన్‌ బర్ల్‌ 3 టెస్టుల్లో 24 పరుగులు, 18 వన్డేల్లో 243 పరుగులతో పాటు 7 వికెట్లు, 25 టీ20ల్లో 393 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు.

ఇక ప్రపంచ దేశాల్లో పేదరికంతో అలమటిస్తున్న దేశాల్లో జింబాబ్వే ఒకటి. నల్లజాతీయులు అనే వివక్ష వారిని మరింత వెనక్కి నెట్టేసింది. దశాబ్దాలకు పైగా వారు కనీసం ఏ క్రీడల్లో కూడా ఆడేందుకు అనుమతించలేదు. అలాంటిది కాస్త కూస్తో జింబాబ్వేకు పేరు వచ్చింది క్రికెట్‌ ద్వారానే అని చెప్పొచ్చు. రెండు దశాబ్దాల కిందటి వరకు జింబాబ్వే జట్టులో కాస్త పేరున్న ఆటగాళ్లు ఎ‍క్కువగా కనిపించేవారు. హిత్‌ స్ట్రీక్‌, ఆండీ ప్లవర్‌, గ్రాంట్‌ ఫ్లవర్‌,హెన్రీ ఒలాంగా, తైబూ, స్టువర్ట్‌ క్యాంప్‌బెల్‌ లాంటి ఆటగాళ్లు ఉండేవారు. వీరు ఉ‍న్నంతకాలం జింబాబ్వే ఆటతీరు కాస్త మెరుగ్గానే ఉండేది. బలహీన జట్టుగా కనిపించినా.. కాస్త పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించేది.

వీళ్లంతా రిటైర్‌ అయ్యాకా జింబాబ్వే ఆటతీరు మరింత తీసికట్టుగా తయారైంది. బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, అప్ఘనిస్తాన్‌ల కంటే ఎంతో ముందు అంతర్జాతీయ క్రికెటలోకి వచ్చిన జింబాబ్వే వారి చేతిలో కూడా పరాజయం పాలై అనామక జట్టుగా తయారైంది. దీనికి తోడూ క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడంతో 2019 జూలైలో ఐసీసీ జింబాబ్వేను ఆట నుంచి బహిష్కరించింది. దీంతో  వారి కష్టాలు రెట్టింపయ్యాయి. ఎంతలా అంటే కనీసం జింబాబ్వే క్రికెట్‌ బోర్డు వారి ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులు కూడా చెల్లించలేకపోయింది. ఆ తర్వాత 2019 అక్టోబర్‌లో ఐసీసీ జింబాబ్వేపై ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా పాకిస్తాన్‌ జట్టు జింబాబ్వేలో పర్యటించింది. రెండు టెస్టుల సిరీస్‌ను పాక్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేయగా.. తర్వాత జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో గెలిచిన జింబాబ్వే మిగతా రెండు ఓడిపోయి 2-1 తేడాతో సిరీస్‌ను పాక్‌కు అప్పగించింది.
చదవండి: ఈ వ్యక్తిని అందుకోవడం కష్టంగా ఉంది : వార్నర్‌

నెలరోజులు గది నుంచి బయటికి రాలేకపోయా: పృథ్వీ షా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top