
వెస్టిండీస్‌తో అక్టోబర్ 2న ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (India vs West Indies) కోసం టీమిండియాను (Team India) ఇవాళ (సెప్టెంబర్ 25) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించిన విధంగానే ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌కు (karun Nair) చోటు దక్కలేదు.
ఇంగ్లండ్ సిరీస్‌లో కరుణ్ 8 ఇన్నింగ్స్‌ల్లో 25.62 సగటున కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 205 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో కరుణ్‌కు మంచి ఆరంభాలు లభించినా, వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు.
2016లో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన కరుణ్.. కొద్ది రోజుల్లో ఫామ్ కోల్పోయి కనుమరుగయ్యాడు. ఇటీవల దేశవాలీ క్రికెట్‌లో అసాధారణ ప్రదర్శనలు చేసి తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక మరోసారి జట్టులో చోటు కోల్పోయాడు.
ప్రదర్శననే కొలమానంగా తీసుకొని సెలెక్టర్లు కరుణ్ తప్పించడం సమంజసమే అయినప్పటికీ.. కొందరు మాత్రం అతడికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కరుణ్ అంశంపై స్పందించాడు. ఇంగ్లండ్ టూర్‌లో కరుణ్ నుంచి చాలా ఆశించామని తెలిపాడు. కరుణ్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్న దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) మాకు చాలా ఆప్షన్స్ ఇస్తాడని అన్నాడు. ప్రతి ఆటగాడికి 15-20 అవకాశాలు ఇవ్వాలనుకుంటాం. కానీ, అది ఎప్పుడూ సాధ్యపడదని పేర్కొన్నాడు.
సెలెక్టర్లను ఆకట్టుకున్న పడిక్కల్
కరుణ్‌ను ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న సెలెక్టర్లకు పడిక్కల్ ఆశాకిరణంలా కనిపించాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న పడక్కల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ఆస్ట్రేలియా-ఏపై భారీ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం పడిక్కల్ ఫిట్‌నెస్, ఫామ్ సెలక్టర్లను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే రెండు టెస్ట్‌లు ఆడిన పడిక్కల్.. మిడిలార్డర్‌లో కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్