Tokyo Olympics Day 13: సెమీఫైనల్లో ఓడిన భారత మహిళల జట్టు

Tokyo Olympics Day 13 August 4 Updates And Highlights In Telugu - Sakshi

సెమీఫైనల్లో ఓడిన భారత మహళల హాకీ జట్టు
► టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌ పోరు ముగిసింది. సెమీఫైనల్లో భాగంగా బుధవారం అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-1 తేడాతో ఓడిపోయింది. తొలి క్వార్టర్‌ ఆదిలోనే గుర్జీత్‌ కౌర్‌ గోల్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అర్జెంటీనా త‌ర‌ఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్ట‌ర్‌లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్ట‌ర్ల‌లో రెండు గోల్స్ ప్ర‌త్య‌ర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్ట‌ర్‌లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు స‌మం చేసే అవ‌కాశం రాలేదు. ఈ ఓటమితో భారత మహిళల జట్టు కాంస్య పతకం కోసం ఆగస్టు 6న బ్రిట‌న్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 

ఫైనల్‌ చేరిన రెజ్లర్‌ రవికుమార్‌
► భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా ఫైనల్లో ప్రవేశించి సంచలనం సృష్టించాడు. సెమీస్‌ మ్యాచ్‌లో భాగంగా రవికుమార్‌ దహియా గెలుపొందాడు. 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో క‌జ‌కిస్థాన్ రెజ్ల‌ర్ నూరిస్లామ్ స‌న‌యేవ్‌పై రవికుమార్‌ విక్టరీ బైఫాల్‌ కింద గెలుపొందినట్లు ప్రకటించారు. సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక ద‌శ‌లో ప్ర‌త్య‌ర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమ‌యంలో ర‌వికుమార్ అత‌న్ని రింగ్ బ‌య‌ట‌కు తోసే క్ర‌మంలో నూరిస్లామ్ కాలికి గాయ‌మైంది. కాలికి క‌ట్టుకొని మ‌ళ్లీ రింగులోకి వ‌చ్చినా.. అత‌డు ర‌వికుమార్ ప‌ట్టుకు నిలవ‌లేక‌పోయాడు. దీంతో రిఫ‌రీ ర‌వికుమార్‌ను విక్ట‌రీ బై ఫాల్ కింది విజేత‌గా ప్ర‌క‌టించాడు.  రవికుమార్‌ ఫైనల్‌ చేరడంతో భారత్‌ ఖాతాలో మరో పతకం ఖాయమైంది.

దీపక్‌ పూనియా ఓటమి
► పురుషుల రెజ్లింగ్‌ సెమీస్‌లో దీపక్‌ పునియా ఓటమి పాలయ్యాడు. రెజ్లింగ్‌ 86 కిలోల విభాగం సెమీస్‌లో అమెరికా రెజ్లర్‌ మోరిస్‌ చేతిలో దీపక్‌ 0-10 తేడాతో చిత్తుగా ఓడిపోయాడు. కాగా ఈ మ్యాచ్‌లో దీపక్‌ ఓటమి పాలైనా పతకం ఆశలు మిగిలే ఉన్నాయి. గురువారం కాంస్య పతకం కోసం పోటీ పడనున్నాడు.

Tokyo Olympics Updates: బాక్సింగ్‌ మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా సెమీస్‌లో ఓటమి పాలైంది. టర్కీ బాక్సర్‌ బుసేనాజ్‌ చేతిలో పరాజయం చెందింది. అయితే, గతనెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్‌ చైన్‌పై విజయం సాధించి లవ్లీనా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన మూడో భారత బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది.

భారత్‌కు మూడో పతకం


లవ్లీనా కాంస్యం గెలుచుకోవడంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే వెయిట్‌ లిఫ్టర్‌ మీరా బాయి చాను రజతం, షట్లర్‌ పీవీ సింధు కాంస్య పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే.

దీపక్‌ అద్భుతం చేస్తే..
రెజ్లింగ్‌ పురుషుల 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా సెమీ ఫైనల్‌లో భాగంగా..  అమెరికాకు చెందిన డేవిడ్‌ మోరిస్‌తో తలపడుతున్నాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో దీపక్‌ చైనాకు చెందిన జూషన్‌ను 6-3 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.


అప్‌డేట్స్‌:
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా సెమీస్‌ చేరగా.. తాజాగా రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగంలో రవి కుమార్‌ సైతం సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో బల్గేరియాకు చెందిన వాలెంటినో వాగేలోవ్‌ను 14-4 తేడాతో ఓడించి రవి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఒలింపిక్స్‌ ఆడిన తొలిసారే సెమీ ఫైనల్‌ చేరిన ఆటగాడిగా ప్రత్యేకత చాటుకున్నాడు.

దీపక్‌ పునియా సంచలనం
భారత రెజ్లర్‌ దీపక్‌ పునియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్‌ పురుషుల 86 కిలోల విభాగం క్వార్టర్‌ ఫైనల్‌లో ప్రత్యర్థి రెజ్లర్‌, చైనాకు చెందిన జూషన్‌ను 6-3 తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. సెమీస్‌లో అతడు అమెరికాకు చెందిన డేవిడ్‌ మోరిస్‌తో తలపడనున్నాడు.

అప్‌డేట్స్
వారెవ్వా దీపక్‌..
►రెజ్లింగ్‌ పురుషుల 86 కిలోల విభాగంలో భారత రెజ్లర్‌ దీపక్‌ పునియా అద్భుతంగా రాణించాడు. నైజీరియా రెజ్లర్‌, ప్రత్యర్థి ఎకెరెమె అజియోమోర్‌పై 12-1 తేడాతో గెలుపొంది క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఇక అంతకుముందు 57 కిలోల విభాగంలో భారత రెజ్లర్‌ రవి కుమార్‌ సైతం క్వార్టర్స్‌ చేరడంతో భారత రెజ్లింగ్‌ శిబిరంలో నూతనోత్సాహం నెలకొంది.


అన్షు మాలిక్‌ ఓటమి..
రెజ్లింగ్‌ మహిళల 57 కిలోల విభాగంలో భారత మహిళా రెజ్లర్‌ అన్షుమాలిక్ నిరాశ పరిచింది. 2-8 తేడాతో బెలారస్‌ రెజ్లర్‌ ఇరీనా కురాచ్‌కినా చేతిలో ఓటమి పాలైంది. అయితే, ఇరీనా ఫైనల్‌ చేరితే మాత్రం 19 ఏళ్ల అన్షు మాలిక్‌కు ఒలింపిక్స్‌ బరిలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

క్వార్టర్స్‌కు రవికుమార్‌
రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగ భారత ఆటగాడు రవి కుమార్‌ సత్తా చాటాడు. కొలంబియాకు చెందిన అర్బనోను 13-2 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.

నీరజ్‌ చోప్రా సరికొత్త చరిత్ర
పురుషుల జావెలిన్ త్రోలో భారత అథ్లెట్‌ నీరజ్ చోప్రా అదరగొట్టేశాడు. తొలిసారిగా ఒలింపిక్స్‌ ఆడుతున్న ఈ యువ ఆటగాడు.. గ్రూప్‌ ఏ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. బుధవారం ఉదయం 5: 35 నిమిషాలకు జరిగిన పోటీలో అందరి కంటే ఎక్కువ దూరం విసిరి గ్రూప్‌- ఏలో టాప్‌లో నిలిచాడు.

తద్వారా జావెలిన్‌ త్రో విభాగంలో ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్‌గా ఈ 23 ఏళ్ల అథ్లెట్‌ నిలిచాడు. ఇక ఆగష్టు 7న ఫైనల్‌ పోరులో టాప్‌-3లో నిలిస్తే నీరజ్‌ చోప్రాకు పతకం ఖాయం కానుంది. మరోవైపు.. పురుషుల జావెలిన్‌ త్రో విభాగంలో గ్రూప్‌ బీ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో భారత మరో అథ్లెట్‌ శివ్‌పాల్‌ సింగ్‌ పూర్తిగా నిరాశపరిచాడు. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

నిరాశ పరిచిన శివ్‌పాల్‌ సింగ్‌
పురుషుల జావెలిన్‌ త్రో విభాగంలో గ్రూప్‌ బీ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో భారత అథ్లెట్‌ శివ్‌పాల్‌ సింగ్‌ పూర్తిగా నిరాశపరిచాడు. తొలి ప్రయత్నంలో 76.40 మీటర్లు విసిరిన అతడు.. రెండో ప్రయత్నంలో 74.80, మూడో ప్రయత్నంలో 74.81 మీటర్లు మాత్రమే విసరగలిగాడు.

ఉ.11 గంటలకు బాక్సింగ్‌ మహిళల 69 కిలోల విభాగం సెమీస్‌

ఇప్పటికే క్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ చిన్‌చెన్‌పై విజయం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా నేడు సెమీస్‌ పోరుకు సన్నద్ధమైంది. సెమీ ఫైనల్‌లో ప్రపంచ ఛాంపియన్‌ బుసానెజ్‌తో ఆమె తలపడనుంది. ఇక క్వార్టర్స్‌లో చిన్‌చెన్‌పై గెలుపొందిన లవ్లీనా పతకం ఖాయం చేసిన సంగతి తెలిసిందే.

టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్‌ షెడ్యూల్‌
ఉ.8 గంటలకు మహిళల 400 మీ. హార్డిల్స్‌ ఫైనల్‌
ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగం (రవికుమార్‌)
ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్‌ మహిళల 57 కిలోల విభాగం (అన్షుమాలిక్‌)
ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్‌ పురుషుల 86 కిలోల విభాగం (దీపక్‌ పునియా)
ఉ.11 గంటలకు బాక్సింగ్‌ మహిళల 69 కిలోల విభాగం సెమీస్‌ (లవ్లీనా)
మధ్యాహ్నం 2:45 గంటల నుంచి రెజ్లింగ్‌ సెమీఫైనల్‌
మధ్యాహ్నం 3:30 నుంచి హాకీ మహిళల సెమీస్‌ (భారత్‌-అర్జెంటీనా)
సాయంత్రం 5:35 నుంచి పురుషుల 800 మీ. హార్డిల్స్‌ ఫైనల్‌
సాయంత్రం 6:25 నుంచి పురుషుల 200 మీ. హార్డిల్స్‌ ఫైనల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top