Rahul Dravid: సెంచరీ సాధించినా నా పేరు ఎవరికీ తెలియలేదు.. అప్పుడే నిర్ణయించుకున్నా!

Rahul Dravid: People Dont Even Know My Name After 1st Ton In School Cricket - Sakshi

Rahul Dravid Comments: టీమిండియా వాల్‌.. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్యాటర్‌గా గుర్తింపు.. పాకిస్తాన్‌ గడ్డపై చిరస్మరణీయ ఇన్నింగ్స్‌(డబుల్‌ సెంచరీ)తో ఆకట్టుకున్న ​క్రికెటర్‌.. ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తున్న దిగ్గజం.. అవును ఈ ఉపోద్ఘాతమంతా రాహుల్‌ ద్రవిడ్‌ గురించే! క్రికెట్‌ ప్రపంచంలో ఆయన పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

అయితే, ఇదంతా ద్రవిడ్‌ మేటి క్రికెటర్‌గా ఎదిగిన తర్వాతి విషయం. కానీ.. అంతకు ముందు సామాన్యుల్లాగే ఆయన పేరు కూడా ఎవరికి తెలియదట! ముఖ్యంగా.. స్కూళ్లో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత కూడా ఓ పత్రికలో ద్రవిడ్‌ పేరు తప్పుగా రాశారట. అది చూసిన ద్రవిడ్‌.. తన పేరు అందరికీ తెలిసేలా చేయాలనే పట్టుదలతో ముందుకు సాగి ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నారు.

నా పేరు ఇదీ అని నమ్మలేదు!
ఈ విషయాలను స్వయంగా రాహుల్‌ ద్రవిడ్‌ స్వయంగా చెప్పుకొచ్చారు. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత షూటర్‌ అభినవ్‌ బింద్రాతో పాడ్‌కాస్ట్‌లో భాగంగా ఆయన ఈ ఘటన గురించి పంచుకున్నారు. ఈ మేరకు ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ‘‘బహుశా ఆ ఎడిటర్‌ కచ్చితంగా స్పెల్లింగ్‌ మిస్టేక్‌ ఉందని భావించి ఉంటారు.. 

ద్రవిడ్‌ అనే పేరుతో ఎవరూ ఉండరని అనుకుని ఉంటారు. అందుకే డేవిడ్‌ అని రాశారేమో!? ఎందుకంటే దాదాపుగా చాలా మందికి ఆ పేరు ఉంటుంది. అప్పుడే నాకు ఓ విషయం అర్థమైంది. 

స్కూల్‌ క్రికెట్లో సెంచరీ చేసిన తర్వాత కూడా నా పేరు ఎవరికీ తెలియలేదు. కాబట్టి మరింత మెరుగ్గా రాణించాలి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలనే పట్టుదల పెరిగింది. నా పేరు ఇది అని నమ్మడానికి కూడా కొంతమంది ఇష్టపడలేదు.. దానిని కచ్చితంగా మార్చాలని నిర్ణయించుకున్నా’’ అని పేర్కొన్నారు. 

12 ఏళ్ల వయసులో మొదలుపెట్టి
కాగా 1973లో మధ్యప్రదేశ్‌లో జన్మించిన రాహుల్‌ ద్రవిడ్‌.. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా చిన్నతనంలో బెంగళూరుకు వచ్చాడు. 12 ఏళ్ల వయసులో కర్ణాటక తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 1991లో రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత 1996లో శ్రీలంకతో వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. మొత్తంగా 509 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి.. 24,208 పరుగులు సాధించాడు. ఇందులో 48 సెంచరీలు ఉన్నాయి.  ఇక ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌.. జట్టుతో పాటు వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్నాడు.

చదవండి: Rohit Sharma Latest Photo: వెస్టిండీస్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్‌.. పంత్‌, డీకేతో పాటు
Ind Vs WI 2nd ODI: టీమిండియా అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన నాలుగో జట్టుగా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top