రెండో టెస్టు: హో విల్సన్‌, ఇది చీటింగ్‌!

Netizens Trolls Third Umpire Decision Against India In Melbourne Test - Sakshi

మెల్‌బోర్న్‌: మెల్‌బోర్న్ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 195 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. శుభ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 28; 5 ఫోర్లు), చతేశ్వర్‌ పుజారా (23 బంతుల్లో 7, 1 ఫోర్‌) క్రీజులో ఉన్నారు. మొదటిరోజు ఆటముగిసే సమయానికి భారత్‌ స్కోరు ఒక వికెట్‌కు 36 పరుగులు. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల హవా సాగింది. బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అశ్విన్‌ మూడు వికెట్లు, మహ్మద్‌ సిరాజ్‌ 2, జడేజా 1 వికెట్‌ సాధించారు. ఇక ఆసీస్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో థర్డ్‌ నిర్ణయాలు రెండు సార్లు టీమిండియాకు‌ వ్యతిరేకంగా రావడం పట్ల అభిమానులు సోషల్‌ మీడియా వేదికంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

తన తొలి టెస్టు వికెట్‌గా మార్నస్‌ లబుషేన్‌ను ఔట్‌ చేసి జోరు మీదున్న సిరాజ్‌ చక్కని బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఆ క్రమంలోనే ఆట 50 వ ఓవర్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ను ఓ అద్భుతమైన బంతితో ఎల్బీగా ఔటయ్యే ప్రయత్నం చేశాడు. అయితే, సిరాజ్‌ అప్పీల్‌ను అంపైర్‌ పట్టించుకోకపోవడంతో.. టీమిండియా కెప్టెన్‌ రహనే డీఆర్‌ఎస్‌ కోరాడు. రీప్లేలో బంతి‌ లెగ్‌సైడ్‌ వైపుగా వెళ్తున్నట్టుగా తేలడంతో థర్డ్‌ అంపైర్‌ పాల్‌ విల్సన్‌ నిర్ణయం ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేశాడు. అలా టిమ్‌ బతికిపోయాడు. ఆట 55 వ ఓవర్‌లోనూ అతను మరోసారి సేవ్‌ అయ్యాడు. అశ్విన్‌ వేసిన బంతిని మిడాఫ్‌లోకి షాట్‌ ఆడిన కామెరూన్‌ గ్రీన్ పరుగుకోసం యత్నించాడు.. పరుగు పూర్తవుతుందా లేదా అనే సందిగ్గంలోనే టిమ్‌ రన్‌ తీశాడు. 
(చదవండి: అతనికి అరుదైన గౌరవం.. ఇది రహానేకే సాధ్యం)

అయితే, కీపర్‌ పంత్‌కు బంతి చేరడం, అతను వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. కానీ, టిమ్‌ క్రీజుకు చేరుకున్నాడా లేదా అనే విషయమై కొంత అస్పష్టత ఉండటంతో థర్డ్‌  అంపైర్ విల్సన్‌ బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద టిమ్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో టిమ్‌ మరోసారి బతికిపోయాడు. దీంతో థర్డ్‌ అంపైర్‌ పాల్‌ విల్సన్‌పై భారత క్రికెట్‌ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అతను పక్షపాతంగా వ్యవరించాడని ఆరోపిస్తున్నారు. టిమ్‌ బ్యాట్‌ క్రీజు లైన్‌ను క్రాస్‌ చేయలేదని చెప్తున్నారు. విజువల్స్‌ అంత బాగా కనిపిస్తుంటే చూడరా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రెండు లైఫ్‌లు వచ్చినప్పటికీ టిమ్‌ వాటిని వినియోగించుకోలేదు. 38 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 13 పరుగులు చేసిన టిమ్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో విహారికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.
(చదవండి: క్యాచ్‌ మిస్‌ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top