Rahul Dravid: క్లీన్‌స్వీప్‌ సంతోషం.. కానీ మన కాళ్లు నేల మీదే ఉండాలి.. కివీస్‌కు అంత తేలికేమీ కాదు కదా!

Ind Vs Nz: Rahul Dravid Urges Realistic Look At Win Keep Feet On Ground - Sakshi

Ind Vs Nz 3rd T20I: Rahul Dravid Comments On India Victory And New Zealand Defeat: న్యూజిలాండ్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి ఫుల్‌జోష్‌లో ఉంది టీమిండియా. మూడో టీ20లో 73 పరుగుల భారీ తేడాతో గెలుపొంది 3-0 తేడాతో విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు.. హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు ఇదే తొలి సిరీస్‌ విజయం... అందునా క్లీన్‌స్వీప్‌ కావడంతో డ్రెస్సింగ్‌రూంలో సంబరాలు అంబరాన్నంటాయి. మరోవైపు.. ఇక టీ20 వరల్డ్‌కప్‌-2021 రన్నరప్‌నకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘నిజంగా ఈ సిరీస్‌ విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. సిరీస్‌ ఆసాంతం ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆడారు. అయితే, వాస్తవ పరిస్థితుల గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మన కాళ్లు నేలమీదే ఉండాలి. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఆడిన తర్వాత వెనువెంటనే... ఆరు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడటం న్యూజిలాండ్‌కు అంత తేలికేమీ కాదు. మన కాళ్లు నేలమీదే ఉండాలి... మరింత ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి’’ అని రాహుల్‌ ద్రవిడ్‌ వ్యాఖ్యానించాడు. 

ఇక వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌నకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలన్న ద్రవిడ్‌... ‘‘గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న వాళ్లకు విశ్రాంతినిచ్చి.. వారి స్థానంలో కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం. కొంతమంది ఈ ఛాన్స్‌ను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. తదుపరి వరల్డ్‌కప్‌ వరకు వివిధ కాంబినేషన్ల గురించి ఒక అంచనాకు వచ్చే అవకాశం లభించింది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 సిరీస్‌ ముగిసిందని.. న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం సిద్ధమవ్వాలని ద్రవిడ్‌ ఆటగాళ్లకు విజ్ఞప్తి చేశాడు. కాగా నవంబరు 25- 29 వరకు కాన్పూర్‌ వేదికగా మొదటి టెస్టు, డిసెంబరు 3- 7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరుగనున్నాయి.

చదవండి: Unmukt Chand Marriage: ప్రేయసిని పెళ్లాడిన ఉన్ముక్త్‌ చంద్‌... ఫొటోలు వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top