‘రోహిత్‌ చెప్పేశాడు.. అందుకే నాకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కలేదు’ | He Told Me Clearly Chahal Reveals Why He Axed From IND 2023 WC Squad | Sakshi
Sakshi News home page

‘రోహిత్‌ చెప్పేశాడు.. అందుకే నాకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కలేదు’

Oct 16 2026 2:48 PM | Updated on Oct 16 2026 3:08 PM

He Told Me Clearly Chahal Reveals Why He Axed From IND 2023 WC Squad

టీమిండియా ఉత్తమ స్పిన్నర్లలో యజువేంద్ర చహల్‌ కూడా ఒకడు. అయితే, వైట్‌బాల్‌ క్రికెట్‌లో పరిస్థితి ఎలా ఉన్నా.. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో మాత్రం అతడికి తగినంత గుర్తింపు దక్కలేదన్నది జగమెరిగిన సత్యం. దేశీ రెడ్‌బాల్‌ టోర్నీలు, ఇంగ్లండ్‌ కౌంటీల్లో రాణించినప్పటికీ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం మాత్రం చహల్‌కు రాలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవలే.. 36 ఏళ్ల చహల్‌ రెడ్‌బాల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే, వన్డే, టీ20 జట్ల తరఫు పునరాగమనం చేయగలననే నమ్మకం మాత్రం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక​ తాజాగా.. భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చహల్‌ తన కెరీర్‌కు సంబంధించిన విశేషాల గురించి పంచుకున్నాడు.

రోహిత్‌ చెప్పేశాడు..
ముఖ్యంగా స్వదేశంలో 2023 వన్డే వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తనను తప్పించడానికి గల కారణాలు ఏమిటో వివరించాడు. ‘‘2023లో నేను కౌంటీలు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లాను. అప్పుడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాతో మాట్లాడాడు. ఈసారి ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్‌ ఉండేలా జట్టు కూర్పు ఉంటుందని చెప్పాడు.

 అందుకే నాకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కలేదు
అంతేకాదు.. ప్రపంచకప్‌ టోర్నీ కోసం వాళ్లు అదనపు ఫాస్ట్‌ బౌలర్‌ కోసం మాత్రమే చూస్తున్నారని స్పష్టం చేశాడు. తద్వారా నా అవసరం జట్టుకు లేదని తెలియజేశాడు. ఇక వరల్డ్‌కప్‌ తర్వాత నేను టీమిండియా సెలక్షన్‌ గురించి ఆలోచించడం మానేశాను’’ అని చహల్‌ తెలిపాడు.

కాగా అహ్మదాబాద్‌లో జరిగిన వన్డే 2023 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆతిథ్య టీమిండియ ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీలో పేసర్‌ మహ్మద్‌ షమీ భారత్‌ ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

వీరికి చోటు
ఇదిలా ఉంటే..  నాడు బౌలింగ్‌ విభాగంలో దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌.. పేసర్లు మహ్మద్‌ షమీ, మహ్మద్‌ రాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌లను యాజమాన్యం ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేసింది.

ఇక 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన చహల్‌.. టీమిండియా తరఫున 72 వన్డేలు, 80 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ వన్డేల్లో 121, టీ20లలో 96 వికెట్లు కూల్చాడు. 

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా
చివరగా 2023లో భారత్‌ తరఫున జనవరిలో వన్డే, ఆగష్టులో టీ20 మ్యాచ్‌ ఆడాడు. అయితే, 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా ఐపీఎల్‌లో ఇప్పటికి 188 మ్యాచ్‌లు ఆడిన చహల్‌ 233 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 

చదవండి: భారత్‌ను వీడనున్న సూర్యకుమార్‌.. త్వరలో దుబాయ్‌కు మకాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement