రేషన్‌.. పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

రేషన్‌.. పరేషాన్‌

Jun 8 2025 7:19 AM | Updated on Jun 8 2025 7:19 AM

రేషన్

రేషన్‌.. పరేషాన్‌

● సర్వర్‌, సాంకేతిక సమస్యలతో బియ్యం పంపిణీ ఆలస్యం ● ఇబ్బందులు పడుతున్న రేషన్‌ డీలర్లు, లబ్ధిదారులు

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): సన్న బియ్యం కోసం రేషన్‌ షాప్‌ల వద్ద కార్డుదారులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతుండటంతో రేషన్‌ బియ్యం తీసుకొనేందుకు ఉదయమే రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్తున్నారు. రేషన్‌ను త్వరగా తీసుకుని పొలం పనులకు వెళ్లవచ్చనే ఆశతో దుకాణాలకు వెళ్తున్నప్పటికీ వారికి నిరాశే ఎదురవుతోంది. రేషన్‌షాప్‌ల వద్ద సర్వర్‌ బిజీ, వేలిముద్రలు వెంటనే రాకపోవడం తదితర కారణాల వల్ల సమయానికి రేషన్‌ ఇవ్వలేక డీలర్లు, రేషన్‌ పొందలేక కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మూడు నెలల రేషన్‌ పొందేందుకు కార్డుదారులు అవస్థలు పడుతున్నారు.

వేధిస్త్తున్న సర్వర్‌ సమస్య

సన్న బియ్యం కోసం రేషన్‌షాప్‌లకు వెళ్లిన కార్డుదారులు సమయానికి బియ్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కేంద్రప్రభుత్వం 5 కిలోల బియ్యం సరఫరా చేస్తుండగా, ఒక కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఐదు కిలోల బియ్యంకు ఒకసారి, ఒక కిలో బియ్యం ఒకసారి ఫింగర్‌ ప్రింట్‌ యంత్రంపై వేలిముద్రలు ఇవ్వాలి. అయితే మూడు నెలల రేషన్‌కు మొత్తం ఆరుసార్లు వేలిముద్రలు ఇవ్వవలసి రావడంతో ఒక్కొక్క కార్డు దారుడు బియ్యం తీసుకునేందుకు 15 నుంచి 30 నిమిషాలు పడుతోంది. అయితే కొన్నిసార్లు వేలిముద్రలు తీసుకునే క్రమంలో సర్వర్‌ సమస్య తలెత్తడంతో బియ్యం పంపిణీ మరింత ఆలస్యమవుతోంది. సర్వర్‌ సమస్యతో పాటు వేలి ముద్రలు త్వరగా రాకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా రోజుకు 100 మంది కార్డుదారులకు కూడా బియ్యం పంపిణీ చేయలేకపోతున్నామని రేషన్‌ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని బియ్యం పంపిణీలో జాప్యాన్ని నివారించాలని రేషన్‌ డీలర్లు, లబ్ధిదారులు కోరుతున్నారు.

సర్వర్‌ సమస్యతోనే ఇబ్బంది

సర్వర్‌ బిజీ కారణంగా రేషన్‌ బియ్యం పంపిణీ చాలా ఆలస్యం అవుతోంది. రోజుకు 100 మంది కార్డుదారులకు కూడా బియ్యం ఇవ్వలేని పరిస్థితి ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి.

–అబ్ధుల్‌ రెహ్మాన్‌, రేషన్‌ డీలర్‌,అత్నూర్‌

ఇబ్బందులు తొలగిస్తాం

సర్వర్‌ బిజీ కారణంగా రేషన్‌ బియ్యం పంపిణీలో వస్తున్న ఇబ్బందులు మా దృష్టికి కూడా వచ్చాయి. ఈ పాస్‌ స్థానంలో కొత్త సాప్ట్‌వేర్‌ను తీసుకువస్తున్నాం. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రేషన్‌ షాప్‌లను పరిశీలిస్తున్నారు.

–జి.బాల సరోజ, డీసీఎస్‌ఓ, సంగారెడ్డి

రేషన్‌.. పరేషాన్‌1
1/2

రేషన్‌.. పరేషాన్‌

రేషన్‌.. పరేషాన్‌2
2/2

రేషన్‌.. పరేషాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement