పంచాయతీరాజ్ శాఖ తప్పిదాలపై చర్యలేవి..?
యర్రగొండపాలెం: పంచాయతీల సర్పంచుల తీర్మానాలు, సంతకాలు లేకుండా టీడీపీ నాయకులు నిధులు డ్రా చేస్తున్నారని, దీనిపై నేను స్వయంగా వచ్చి ఫిర్యాదు చేసినా పట్టించుకోరా అని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవీలో ఉన్న పవన్‌కల్యాణ్ ఆ శాఖలో జరుగుతున్న తప్పిదాలను సరిచేసుకోవడం చేతకాక నేను సీఎం కాదని తప్పించుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలం ముటుకుల పంచాయతీలో సర్పంచ్ సంతకం లేకుండానే నాయకులు డబ్బులు డ్రా చేశారన్నారు. ప్రభుత్వ నిధులు డ్రా చేయడం అత్యంత నేరపూరిత చర్య అయినా తూతూమంత్రంగా విచారణ చేశారన్నారు. ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రా చేసినట్లు కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ చర్య ఎవరిని రక్షించడానికని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్నా మూడు డీఆర్‌సీలలో రిక్వెస్ట్ పెట్టినా, జిల్లా పరిషత్ సమావేశాల్లో గొంతు చించుకొని అడిగినా చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖ పనితీరు అట్టడుగు స్థాయికి పడిపోయిందన్నారు. పూర్తిగా వెనకబడిన యర్రగొండపాలెం నియోజకవర్గంలో రోడ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇకనైనా మొద్దు నిద్ర వీడి హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకోవడం మాని గ్రామాల్లో తిరిగి రోడ్లను పూర్తి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, జిల్లా కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, రైతు విభాగం జిల్లా కార్యదర్శి వై.వెంకటేశ్వరరెడ్డి, బిజ్జం రమణారెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు సయ్యద్ జబీవుల్లా, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పి.రాములు నాయక్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
సర్పంచుల సంతకాలు లేకుండా నిధులు ఎలా డ్రా చేస్తారు..?
పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్


