ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

Published Wed, May 8 2024 5:00 AM

ఎన్ని

ఒంగోలు అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం ప్రకాశం భనంలోని కంట్రోలు రూములో ఎన్నికల నిర్వహణపై విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ జరిగే పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రతతో ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం కమిషన్‌ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తి చేశారన్నారు. ఇప్పటి వరకు 80 శాతం ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో మొత్తం 18,22,470 మంది ఓటర్లు ఉండగా 14,46,495 మందికి ఓటరు స్లిప్‌లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేస్తామన్నారు. 8 నియోజకవర్గాల్లో హోమ్‌ ఓటింగ్‌తో కలిపి మొత్తం 22,132 పోస్టల్‌ బ్యాలెట్‌లలో ఈ నెల 6వ తేదీ నాటికి 16,215 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోలు రూములో 08592–288599 నంబర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. సీ–విజిల్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ చేసి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 12వ తేదీ జిల్లాలోని నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి సంబంధిత పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ పార్టీలను పంపేందుకు అవసరమైన 486 వాహనాలను సిద్ధం చేశామన్నారు. పోలింగ్‌ సిబ్బంది బస చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.3.83 కోట్ల విలువైన సరుకును సీజ్‌ చేశామన్నారు. ఎంసీసీ వైలేషన్‌ కింద 67 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇళ్ల పట్టాలు దొంగ పట్టాలని ప్రచారం చేస్తే చర్యలు:

పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను దొంగ పట్టాలని అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందంటే ఒక అథంటికేషన్‌తో ఇళ్ల పట్టాలు ఇస్తుందన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఈసీ చూసుకోవచ్చన్నారు. ఇళ్ల పట్టాలపై వచ్చిన అసత్య ప్రచారాలపై వచ్చిన ఫిర్యాదులపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయన్నారు.

ఎస్‌పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కీలక పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు, కేంద్ర బలగాలతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 263 రూట్‌ మొబైల్‌, 56 క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలు, 22 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు, 9 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు పనిచేస్తాయన్నారు.

వీటితో పాటు సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, తమిళనాడు పోలీసులు, స్థానిక పోలీసులతో మరికొన్ని బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిలో డీఆర్‌ఓ శ్రీలత, కమాండ్‌ కంట్రోలు రూము నోడల్‌ అధికారి వరకుమార్‌, ఏఓ శ్రీకాంత్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

పోలింగ్‌కు పటిష్టమైన ఏర్పాట్లు

ఈవీఎం కమిషన్‌ పూర్తి చేశాం, 80 శాతం ఓటరు స్లిప్‌లు పంపిణీ

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరగకుండా పక్కా నిఘా

ఇళ్ల పట్టాలపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు

విలేకర్ల సమావేశంలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
1/1

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

Advertisement
Advertisement