బీజేపీ కార్యకర్తలపై వాటర్‌ కెనాన్లతో దాడి

Police Use Water Cannon To Disperse Protesting BJP Workers At Rajasthan - Sakshi

జైపూర్‌ : ప్రశ్నాపత్రం లీకేజ్‌ వ్యవహారం రాజస్థాన్‌లో సంచలనంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వర్సెస్‌ బీజేపీ నేతలు అనే విధంగా పరిస్థితి నెలకొంది. బీజేపీ నేతల నిరసనలతో మంగళవారం రాజస్థాన్‌ హోరెత్తిపోయింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. వారిపై వాటర్‌ కెనాన్లను ప్రయోగించారు పోలీసులు. 

 వివరాల ప్రకారం.. రాజస్థాన్ ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (రీట్) ప్రశ్నాపత్రం లీక్‌పై వివాదం కొనసాగుతోంది. ఈ పేపర్ లీక్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ జైపూర్‌లో ప్రతిపక్ష బీజేపీ మంగళవారం భారీ నిరసన చేపట్టింది. కాగా, అశోక్‌ గెహ్లాట్‌ సర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలతో ఆ పార్టీ నేతలు పార్లమెంట్‌ హౌస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై వాటర్‌ కెనాన‍్లను ఉపయోగించారు. అనంతరం బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. గెహ్లాట్‌ ప్రభుత్వం రూ. 500 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ స్కామ్‌లో సీఎం గెహ్లాట్‌ ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించే వరకు నిరసనను కొనసాగిస్తామన్నారు. ఈ కేసులో కొందరు మంత్రులు, ఉన్నతాధికారుల హస్తం ఉందని అందుకే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ మొండిగా వ్యవహరిస్తోందని సీఎం గెహ్లాట్‌ అన్నారు. ప్రభుత్వంపై కుట్రతోనే బీజేపీ ఇలా చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నేతల తీరుతో రిక్రూట్‌మెంట్‌ సమయం మరింత ఆలస్యమవుతుందని సీఎం తెలిపారు. అయితే, ఇటీవలే మూడు కేసులను సీబీఐకి అప్పగించామని, ఏ ఒక్క కేసును కూడా ఆ సంస్థ విచారణ చేపట్టలేకపోయిందని గెహ్లాట్‌ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లోనూ పేపర్‌ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయని, అయితే ఆ రాష్ట్రాల్లో సీబీఐ విచారణకు ఎవరూ డిమాండ్ చేయడం లేదని అసెంబ్లీ వేదికగా సీఎం వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై రాష్ట‍్ర ప్రభుత్వానికి చెందిన ఏజెన్సీ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతోందన్నారు. 

ఇదిలా ఉండగా రీట్‌​ ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అర్హత పరీక్షకు దాదాపు 16 లక్షల మంది నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. పేపర్‌ లీక్‌ కారణంగా రాష్ట‍్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసి.. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్‌ డీపీ జరోలీతో సహా మరికొందరు అధికారులను సస్పెండ్‌ చేసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top