ద్రౌపది ముర్ముకు క్రాస్‌ ఓటింగ్‌ బలం.. విపక్షాలే దగ్గరుండి గెలిపించాయ్‌!

Cross Voting Play Crucial Role In Draupadi Murmu Victory - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ కీలకంగా మారడం ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ చెల్లదు. అంటే.. క్రాస్‌ ఓటింగ్‌కు లైన్‌ క్లియర్‌ అన్నమాట. అయితే ఆత్మప్రభోధానుసారం ఓటేయాలన్న పిలుపును సీరియస్‌గా తీసుకున్న చాలామంది ప్రజాప్రతినిధులు.. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము(64)ను గెలిపించుకోవడం గమనార్హం. 

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు గట్టి దెబ్బే తగిలింది. యశ్వంత్‌ సిన్హాకే ఓటేయాలన్న ఆయా పార్టీల అధిష్టానాల పిలుపును లైట్‌ తీసుకుని.. ద్రౌపది ముర్ముకే ఓటేశారు చాలా మంది. మొత్తం ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది మాత్రమే ఓటేశారు. అలాగే అస్సాం, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల నుంచి భారీగా క్రాస్‌ ఓట్లు ముర్ముకు పోలయ్యాయి.

ముర్ముకు విపక్షాలకు చెందిన పలువురు గిరిజన, ఎస్సీ ప్రజాప్రతినిధులు కూడా జైకొట్టారు. సుమారు 17 మంది ఎంపీలతో పాటు దాదాపు 104 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తెలుస్తోంది. బీజేపీ ఏమో ఆ సంఖ్యను 18 రాష్ట్రాల నుంచి 126 ఎమ్మెల్యేలుగా చెబుతోంది. మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా ముర్ముకు మద్దతుగా 64 శాతం ఓట్లు పోలయ్యాయి. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి ఆమెకు మద్దతు లభించడం గమనార్హం.

అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లో 20, మహారాష్ట్రలో 16, గుజరాత్‌లో 10, జార్ఖండ్‌లో 10, బిహార్‌లో 6,, ఛత్తీస్‌గఢ్‌లో 6, గోవాలో నలుగురు చొప్పున విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ చేశారు. మరోవైపు యూపీ, మహారాష్ట్ర అసెంబ్లీల నుంచి ద్రౌపది ముర్ముకు గరిష్ఠంగా ఓట్లు వచ్చాయి. అలాగే యశ్వంత్‌ సిన్హాకు పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు నుంచి భారీ మద్దతు లభించింది. 

మధ్యప్రదేశ్‌ సీఎం కృతజ్ఞతలు
గిరిజన వర్గానికి చెందిన సోదరి విజయంలో భాగస్వామ్యులైనందుకు కృతజ్ఞతలంటూ విపక్షాల ప్రజాప్రతినిధులకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేయడం గమనార్హం. స్వతంత్రం అనంతరం పుట్టి.. రాష్ట్రపతి హోదాకు ఎన్నికైన అతిచిన్న వయస్కురాలిగా ద్రౌపది ముర్ము సరికొత్త చరిత్ర సృష్టించారు. జులై 25వ తేదీన ఆమె రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు.

ఇదీ చదవండి:  ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాలకు షాక్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top