
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పుల వల్లే నేటికీ ఆంధ్రప్రదేశ్ తిప్పలు పడాల్సి వస్తోందని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. టీడీపీ నాయకుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అప్పులపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యనమలా మీది కునుకుపాటా? ‘ఉనికి’కి పాట్లా అని ప్రశ్నించారు. అప్పులపై మీ ‘అంచనా’లు తలకిందులైనా అసత్య ప్రచారం ఆపరా.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై మంగళవారం ఒక ప్రకటనలో బుగ్గన మండిపడ్డారు.
2021–22 సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం ద్రవ్యలోటు పరిమితి 4.5 శాతం కాగా.. కోవిడ్ విధి వైపరీత్యంలోనూ వైసీపీ ప్రభుత్వం కేవలం 2.1 శాతమే అప్పు చేసిందని తెలిపారు. మొత్తం రూ.1,85,000 కోట్లు డీబీటీ పద్ధతిలో ప్రజలకు సాయం చేశామని, అందులో రూ.1,35,000 కోట్లు.. అంటే 73 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకేనని, వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉన్నంత వరకు రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు ఏ ఇబ్బందీ రాదని బుగ్గన స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలది పూటకోమాట
‘ఆంధ్రప్రదేశ్ అప్పులు, ఆర్థిక నిర్వహణపై ప్రతిపక్షాలది పూటకో మాట. అప్పులపై యనమల లెక్కలన్నీ తప్పులే. తొలుత రూ. 8 లక్షల కోట్లు అన్నారు. మేము అవగాహన కల్పించాక రూ.6.38 లక్షల కోట్లు అన్నారు. అంటే రూ.2 లక్షల కోట్లు తగ్గించారు. మీ అప్పులు, వాటికి వడ్డీలు కడుతూనే, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ప్రవాహంపైనా మీ ఈర్ష్య, ద్వేషం? 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.1,20,556 కోట్లు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు రూ.2,69,462 కోట్లు. 58 సంవత్సరాల్లో చేసిన అప్పుకంటే మీ ఐదేళ్లలో చేసింది 124 శాతం ఎక్కువ.
మీరు చేసిన అప్పులను చక్కదిద్దుతూ, పేరుకుపోయిన బకాయిలను కూడా మా ప్రభుత్వంలో చెల్లిస్తున్నాం. అయినా 2022 మార్చి నాటికి వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 3,82,165 కోట్లు. సీఎం వైఎస్ జగన్‌ది అప్పుల ఘనత కాదు... ఆర్థిక నిర్వహణలో సమర్థత. మా ప్రభుత్వం అన్ని కార్పొరేషన్ల రుణాల వివరాలు బడ్జెట్ డాక్యుమెంట్లతో సహా ఇచ్చింది. ప్రతి విషయం కాగ్‌కి తెలుసు. దాపరికాలు లేవు’ అని బుగ్గన తెలిపారు.