అలా మాట్లాడటం కేసీఆర్‌ వ్యూహాత్మక రాజకీయమేనా?

Article On KCR Positive Comments Congress And Etela Rajender - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభలో చేసిన ప్రసంగం సహజంగానే ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఆయన తెలివిగా రాష్ట్ర ప్రభుత్వం, బడ్జెట్ పై కన్నా, కేంద్రంపైన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుపైన అధికంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఆయన ఉపన్యాసం చూస్తే లోక్ సభలో ప్రతిపక్ష నేత మాట్లాడినట్లుగా ఉంది. వచ్చే ఎన్నికలలో మోదీని గద్దె దించడానికి సిద్దంగా ఉన్న జాతీయ పార్టీ నేత మాదిరిగా ఆయన స్పీచ్ సాగింది. ఒకప్పుడు మోదీని బాగా పొగిడిన కేసీఆర్‌ ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

దానికి ప్రత్యేక కారణాలు ఉండవచ్చు. బీజేపీ వ్యతిరేక స్టాన్స్ ఎక్కువగా తీసుకుంటే తెలంగాణ  శాసనసభ ఎన్నికలలో రాజకీయ ప్రయోజనం అధికంగా ఉంటుందని ఆయన నమ్ముతుండవచ్చు. అదే టైమ్‌లో కాంగ్రెస్‌ను పెద్దగా విమర్శించకపోగా, మన్మోహన్ సింగ్ ప్రదానిగా ఉన్న దశాబ్దకాలాన్ని మోదీ పాలనతో పోల్చి సింగ్ పాలనే బెటర్ అని చెప్పడం కూడా గమనించదగ్గ అంశమే. అలాగే నెహ్రూ, ఇందిరా గాంధీలను మోదీ విమర్శించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. తద్వారా కాంగ్రెస్ వారిని గందరగోళంలో పడేయడానికి కూడా ఆయన ఈ అవకాశాన్ని వాడుకున్నారని చెప్పవచ్చు.  

కేసీఆర్‌ దేశంలో వృద్ది రేటు, ఎగుమతుల వృద్ది రేటు, పారిశ్రామికభవృద్ది రేట్ మొదలైన సంగతులు గురించి చెప్పారు కానీ, మధ్యలో రెండేళ్లపాటు కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని ఆయన కావాలనే విస్మరించారన్న భావన కలుగుతుంది. అదేదో మోదీ ప్రభుత్వం మొత్తం నాశనం చేసిందని చెప్పాలన్నది ఆయన ఉద్దేశంగా ఉంది. వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు కేసీఆర్‌ ప్రధానిని ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడారు. కచ్చితంగా సమర్ధించాలని ఆనాడు అన్నారు. 

కానీ ఈనాడు ఏమంటున్నారు..తనకు అప్పుడు చెప్పింది వేరు.. తర్వాత చేసింది వేరు అని అంటున్నారు. ఆ తేడా ఏమిటో తెలియదు. ప్రస్తుతం మిత్రపక్షాలు గా వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ నోట్ల రద్దు ప్రక్రియను తీవ్రంగా తప్పుపట్టినా, అప్పట్లో కేసీఆర్‌ మాత్రం సమర్ధించారు.ఇప్పుడు వారికంటే ఈయనే ఎక్కువగా విమర్శిస్తున్నారు.నోట్ల చెలామణి బాగాపెరిగిందని గణాంకాలు చెబుతున్నారు.  కెసిఆర ఏ పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మలచుకోవడంలో సిద్దహస్తుడని మరోసారి రుజువు చేసుకున్నారు.

మోదీ గెలిచారు కానీ, ప్రజలు ఓడారని జనరల్ డైలాగును ఆయన వాడారు. మోదీ ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో ఓడిపోక తప్పదని ఆయన జోస్యం చెబుతున్నారు. కానీ సర్వేలు మాత్రం అందుకు విరుద్దంగా వస్తున్నాయి. అయినా కేసీఆర్‌ ఇదే కోణంలో విమర్శ చేస్తున్నారంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది. జాతీయ రాజకీయాలపైన, కేంద్రం తీరుతెన్నుల మీద ఎక్కువ చర్చ జరిగితే ఈ తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్‌ పాలనపై ప్రజలలో అంత రచ్చ ఉండదు. ఏమైనా వైఫల్యాలు ఉన్నా వాటన్నిటిని కేంద్రం ఖాతాలో జమ చేయడానికి కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అనిపిస్తుంది. 

అలా అని కేంద్రం అన్నీ ఒప్పుల కుప్పగా చేసిందని కాదు. కానీ ఒక రాష్ట్ర శాసనసభలో ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో కేంద్రంపైన, ప్రదాని మోదీపైన రాజకీయ విమర్శలు చేయడం చిన్న విషయం కాదు. అయితే వ్యక్తిగత దాడిగా కాకుండా విధానపరంగానే జరగడం మంచిదే. తప్పు అయినా, ఒప్పు అయినా రాజకీయాలు ఇంతవరకు పరిమితం అయితే సమంజసమే. కేంద్రం కన్నా తెలంగాణ ప్రభుత్వమే బాగా పని చేసిందని ఆయన వాదించారు. పైగా జీఎస్‌డీపీలో తెలంగాణలో మూడు లక్షల నష్టం వాటిల్లిందని ఏదో లెక్క చెప్పారు.

అదే సమయంలో తెలంగాణ అప్పు అన్ని రకాలు కలిపి సుమారు నాలుగున్నర లక్షల కోట్లకు ఎందుకు పెరిగింది కూడా ఆయన వివరించి ఉంటే బాగుండేది. విద్యుత్ గురించి ఆయన సభలో మాట్లాడుతున్న తరుణంలోనే కొన్ని టీవీ చానళ్లలో ఆదిలాబాద్ జిల్లాలో కరెంట్ కష్టాలు, వరంగల్ జిల్లాలో ఏదో గ్రామంలో విద్యుత్ కోతకు నిరసనగా ధర్నా అంటూ వార్తలు ప్రసారమవుతున్నాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏమైనా కొంత ఇబ్బంది ఏర్పడి ఉంటే ఉండి వచ్చుకానీ, గత తొమ్మిదేళ్లలో కరెంటు విషయంలో పెద్దగా ఇబ్బంది లేకుండానే చేయగలిగారు.  అదే సమయంలో డిస్కంలు భారీ ఎత్తున బాకీ పడిన విషయాన్ని విపక్షాలు గుర్తు చేస్తుంటాయి. తెలంగాణ అంతా సస్యశ్యామలం అయిపోయిందని చెబుతున్నారు. పాలమూరు నుంచి వలసలు ఆగిపోయాయని అంటున్నారు. 

అది నిజమే అయితే సంతోషించవలసిందే. కానీ వలసలు అన్నవి ఆయా వ్యక్తుల అవసరాలను బట్టి కూడా జరుగుతుంటాయి. కాకపోతే ప్రభుత్వాల వైఫల్యం వల్ల వలసలు వెళ్లే పరిస్థితి లేదని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. అంతవరకు తప్పు లేదు. కానీ ఈ క్రమంలో చంద్రబాబు టైమ్ లో ఇంకుడు గుంతలు, వైఎస్ ఆర్ టైమ్ లో బొంకుడు గుంతలు అంటూ రిధమిక్ డైలాగు వాడారు. చంద్రబాబు ఇంకుడు గుంతల ప్రచారం చేసినప్పుడు కేసీఆర్‌ కూడా అందులో భాగస్వామే అన్న సంగతి ఆయన మర్చిపోయి ఉండవచ్చు.

కాగా వైఎస్ ఉమ్మడి ఏపీలో తలపెట్టిన జలయజ్ఞం ముందుకు సాగబట్టే రెండు ప్రాంతాలలో సాగునీటి సదుపాయాలు బాగా మెరుగు అయ్యాయన్నది వాస్తవం. ఆయన కుమార్తె షర్మిల ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టడంపై కోపం తో వైఎస్ పై విమర్శ చేసి ఉండవచ్చు.ప్రధానిని పొగడడంపై ఒక పిట్టకద వినిపించినా ,ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి ప్రస్తావించినా, ఆ వ్యాఖ్యలు తనకు వర్తిస్తాయన్న సంగతి ఆయన మర్చిపోకూడదు.తెలంగాణ సచివాలయ గుమ్మటాలు కూల్చుతామన్న బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యకు ఘాటు రిప్లై ఇస్తూ , అలా చేస్తే చూస్తూ ఊరుకుంటామా? కాళ్లు, రెక్కలు విరగగొడతారని హెచ్చరించారు.  

కేసీఆర్‌ చేసిన ఒక ముఖ్యమైన విమర్శ అదాని గ్రూప్ షేర్ల పతనం  అంశం. ఈ విషయంపై పార్లమెంటులో ప్రదాని కానీ, ఇతర కేంద్ర మంత్రులు కానీ నోరు విప్పకపోవడం కచ్చితంగా ప్రశ్నించదగిందే. దానిని గట్టిగానే కేసీఆర్‌ ప్రస్తావించారు. అదే సమయంలో డిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె కవిత గురించి చార్జీషీట్ లో పేర్కొనడంపై  కేసీఆర్‌  ఎ క్కడా వివరణ ఇచ్చినట్లు లేదు. బహుశా మోదీపైన విమర్శలు గట్టిగా చేయడంలో ఈ నేపద్యం కూడా ఉండవచ్చు.తన ఏలుబడిలో  తెలంగాణ బ్రహ్మండంగా అభివృద్ది చెందిందని, దేశం మాత్రం మోదీ నాయకత్వంలో వెనుకబడి పోయిందని చెప్పడం ఆయన లక్ష్యం.

అంతవరకు ఆయన సఫలం అయినట్లే.కాకపోతే బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాదానం ఇచ్చి ఉంటే బాగుండేది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై, ఐదు లక్షల కోట్ల అప్పులపై  కేసీఆర్‌ ఎందుకు చర్చ జరపలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగ భృతి , దళితులకు మూడు ఎకరాల భూమి తదితర హామీల అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు. కాగా పెండింగులో ఉన్న రైతు రుణ మాఫీకి నిధులు కేటాయిస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గురించి, అలాగే కాంగ్రెస్ నేతలు కొందరి గురించి కేసీఆర్‌ పాజిటివ్‌గా మాట్లాడడం వ్యూహాత్మక రాజకీయమే అని అంటున్నారు.

తద్వారా ఆయా పార్టీలలో వారిపై అనుమానాలు వ్యాప్తి చేయడమే కావచ్చన్న భావన ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్,బీజేపీలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, వాటివల్ల కేసీఆర్‌ కు పెద్ద ఇబ్బంది ఏమీ రాలేదనే చెప్పవచ్చు. జాతీయ స్తాయిలో మోదీకి అనుకూలంగా సర్వేలు వస్తున్నట్లుగానే రాష్ట్ర స్థాయిలో కేసీఆర్‌కు ప్రస్తుతానికి అనుకూలంగా సర్వేలు వస్తున్నాయి. అయినా వచ్చే తొమ్మిది నెలలు బీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకం అని వేరే చెప్పనవసరం లేదు. దానికి ప్రాతిపదికగా కేసీఆర్‌ ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో రెండుగంటలకు పైగా సమాధానం ఇచ్చారు.  చివరిగా ఒక మాట చెప్పాలి. ఒకప్పుడు ఇరవై తొమ్మిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగేవి. అలాంటిది ఇప్పుడు కేవలం వారం, పది రోజులకే పరిమితం అవుతుండడం ఆశ్చర్యంగానే ఉంటుంది. చిన్న రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితి వచ్చిందా?లేక శాసనసభలో చర్చలు జరపవలసినంత సీన్ లేకుండా పోయిందా? ఏమో!ఏమైనా కావచ్చు. 
- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top