మహిళా పోలీస్‌..! | Sakshi
Sakshi News home page

మహిళా పోలీస్‌..!

Published Wed, Nov 15 2023 2:08 AM

కొమరాడ మండలం గుమడ పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న ఎంఎస్‌పీ  - Sakshi

ఉద్యోగం సేవ

డిగ్రీ పూర్తి చేశాను. సచివాలయ మహిళా పోలీస్‌గా కొలువుదక్కడంతో కుటుంబానికి ఆర్థిక భద్రత లభించింది. ప్రతిరోజూ ప్రజలకు సేవచేసే అవకాశం కలిగింది. గ్రామంలో ఏ చిన్నపాటి వివాదం తలెత్తినా వివరాలను పోలీస్‌ అధికారులకు చేరవేస్తాను. సమస్యను ప్రాథమిక దశలోనే పరిష్కరించేందుకు కృషిచేస్తా. పల్లె ప్రజల ప్రశాంత జీవనమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. అధికారుల సూచనల మేరకు విధులు నిర్వర్తిస్తున్నాను.

– ముంతల రామలక్ష్మి,

ఎంఎస్‌పీ, గుణానపురం

పల్లె ప్రజలకు అండగా..

ఏ సమస్య వచ్చినా గ్రామ ప్రజలు ముందుగా నాకు చెబుతారు. నేను పోలీస్‌ అధికారులకు విషయం చేరవేస్తాను. వారి సూచనల మేరకు సమస్య పరిష్కారానికి కృషిచేస్తాను. గ్రామీణ ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించేందుకు అవసరమైన వాతావరణం కల్పించేందుకు తనవంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.

– ఎం.రోజారాణి, ఎంఎస్‌పీ, కురుపాం

చిత్తశుద్ధితో విధులు

డైట్‌ పూర్తిచేసి ఉద్యోగవేటలో ఉన్న నాకు 2019లో ఇచ్చిన సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో మహిళా సంరక్షణ పోలీస్‌ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం వెలగవాడ సచివాలయంలో చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నాను. పోలీస్‌ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాను. గ్రామస్తులు కూడా ఆదరిస్తున్నారు. చట్టాల గురించి తెలుసుకుంటున్నారు.

– ఎన్‌.రేవతి, ఎంఎస్‌పీ,

వెలగవాడ సచివాలయం,

పాలకొండ మండలం

చట్టాలపై అవగాహన

నా పేరు ప్రవళ్లిక. రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థలో మహిళా సంరక్షణ పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాను. కొమరాడ మండలం గుమడ సచివాలయంలో ఉద్యోగంలో చేరాను. ప్రభుత్వం కల్పించిన ఉద్యోగంతో ప్రజలకు సేవచేసే అదృష్టం దక్కింది. గ్రామంలో శాంతిభద్రతలు పరిరక్షణకు కృషిచేస్తున్నాను. అసాంఘిక శక్తుల వివరాలను పోలీస్‌ అధికారులకు చేరవేస్తున్నాను. గిరిజన మహిళలకు చట్టాలపై

అవగాహన కల్పిస్తున్నాను.

సాక్షి, విజయనగరం డెస్క్‌: ఊరిలో చిన్నపాటి వివాదం జరిగినా.. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినా.. ఎవరైనా అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించినా.. ప్రభు త్వ ఆస్తులకు నష్టం కలిగించినా.. బెట్టింగ్‌లు జరిగినా.. ఇలా ఏ చిన్నపాటి వివాదమైనా గతంలో పోలీస్‌ స్టేషన్‌కు పరుగు తీయాల్సిన పరిస్థితి. ఎస్‌ఐ ఫోన్‌ నంబర్‌ కోసం ఆరా తీయాల్సిందే. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఆ పరిస్థితి తగ్గింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు త్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఊరు/వార్డుకో మహిళా సంరక్షణ పోలీస్‌ను నియమించింది. శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఘటనలు జరిగినా తక్షణమే సమాచారం అందజేసే వ్యవస్థను అభివృద్ధి చేసింది. ప్రభుత్వ పాలనాపరమైన సేవలతో పాటు చట్టపరమైన సేవలనూ ప్రజలకు చేరువ చేసింది. గ్రామం/వార్డులో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేవారిపై మహిళా సంరక్షణ పోలీస్‌(ఎంఎస్‌పీ)లు ప్రత్యేక నిఘా ఉంచుతున్నా రు. వారి కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆ సమాచారాన్ని పోలీస్‌ ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో సారా తయారీ కేంద్రాల వివరాలు.. గంజాయి తరలింపు.. మద్యం అక్రమ విక్రయదారుల సమాచారం.. అల్లర్లకు పాల్పడేవారు... రౌడీ షీటర్లు, పాతనేరస్తుల కదలికలు గమనిస్తూ నేరాలను అడ్డుకట్టవేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. పల్లెలు/వార్డు ప్రజల ప్రశాంత జీవనానికి బాటలు వేస్తున్నారు. చట్టాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ పనితీరును వివరిస్తున్నారు. రుణ యాప్‌లపై చైతన్యం కలిగిస్తున్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. ప్రతిరోజూ ఊరు/వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్‌పరమైన సేవలు అందిస్తూ.. మా ఊరి మహిళా పోలీస్‌లుగా పిలిపించుకుంటున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసులు

విజయనగరం జిల్లాలో 2022లో పేకాట ఆడినవారిపై 112 కేసులు, కోడిపందాలు ఆడుతున్నవారిపై 22 కేసులు, మద్యం తరలిస్తున్నవారిపై 780 కేసులు, సారా తయారీ, రవాణాదారులపై 461 కేసులునమోయ్యాయి. 1,98, 410 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు.

● గంజాయి అక్రమరావాణాదారులపై 2021లో 32 కేసులు నమోదుకాగా, 2022లో 50 కేసులు నమోదయ్యాయి. 89 మందిని అరెస్టుచేసి, వారి నుంచి 3,180 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం చేరవేతలో మహిళా పోలీసులదే కీలక పాత్ర.

● విజయనగరం జిల్లాలో 77 సారా ప్రభావిత గ్రా మాలను గుర్తించారు. సారా విక్రయదారులు 79 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధికల్ప నకు రూ.43.31లక్షలు ఎస్పీ అందజేశారు.

మంచి గుర్తింపు

సచివాలయ మహిళా సంరక్షణ పోలీస్‌లకు పల్లెలు/వార్డుల్లో మంచి గుర్తింపు లభిస్తోంది. ఏ చిన్న సమస్య తలెత్తినా చెబుతున్నారు. వ్యయప్రయాసలు లేకుండా స్థానికంగా సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకం ప్రజల్లో పెరిగింది. మేము కూడా బాధ్యతతో విధులు నిర్వహిస్తూ, ధర్మాన్ని కాపాడుతున్నాం. అసాంఘిక కార్యకలాపాలు, అలజడులు సృష్టించేవారి వివరాలను పోలీస్‌ ఉన్నతాధికారులకు అందజేస్తున్నాం. పల్లెలు ప్రశాంతంగా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చుడంలో భాగస్వాములవుతున్నాం.

– వాండ్రంకి తేజశ్వి, ఎంఎస్‌పీ, గోపాలపురం సచివాలయం, పాలకొండ మండలం

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement