
విశ్వాసానికి త్యాగానికి ప్రతీక
● మానవతా వెలుగుతో ఉదయించాలన్నదే అల్లాహ్ సందేశం ● బక్రీద్–శాంతి సందేశం, మానవతా దీప్తి
పండుగ రోజున ఫజర్ నమాజ్‌ను తమ వీధిలోని మసీదులోనే విధిగా చదవాలి. పరిశుభ్రంగా, మంచి దుస్తులతో అత్తర్, సుర్మా రాసుకుని దారి పొడువునా ‘తక్బీర్’ చదువుతూ తమ ప్రాంతంలోని ఈద్గాకు వెళ్లి మాత్రమే సామూహిక నమాజ్ చేయాలి. ఈద్ నమాజ్ అయ్యే వరకు ఏమీ తినరాదు. ఈద్గా వద్దకు వెళ్లి, వచ్చే మార్గాలు వేర్వేరుగా ఉండాలి. ఈద్ నమాజ్ తర్వాతనే ఖుర్బానీ ప్రక్రియ ప్రారంభించాలి. వాటిని స్వీకరించాలి.
– అబ్దుల్ కలీమ్, ముఫ్తీసాబ్
యడ్లపాడు: పవిత్ర రంజాన్ పర్వదినం అనంతరం ముస్లింల జీవితాల్లో మరొక ఆధ్యాత్మిక సందడిని నింపే పండుగ బక్రీద్. ‘బకర్’ అంటే జంతువు, ‘ఈద్’ అంటే పండుగ– రెండింటి కలయికే బక్రీద్. ఇది ఖుర్బానీ (బలిదానం) పండుగ కూడా. అందుకే దీనిని ‘ఈదుల్ ఖుర్బానీ’ లేదా ‘ఈద్ ఉల్ అదా’గా పిలుస్తారు. రంజాన్ తర్వాత 70 రోజులకు వచ్చే ఈ పండుగకు జిల్లాలోని ఈద్గాలు, మసీదులను మత పెద్దలు సిద్ధం చేశారు. శనివారం బక్రీద్ పండుగ జరుపుకోవాలని ప్రకటించారు. బక్రీద్ ముందు రోజు ‘ఆరఫా’ దినంగా భావిస్తారు. ఇది అల్లాహ్ ప్రేమ పొందడానికి అత్యంత శ్రేష్టమైన దినం. నరకం నుంచి విముక్తి కోరుతూ ఆ రోజు ఉపవాసం ఉండటం ద్వారా చిన్నచిన్న పాపాలు కూడా క్షమించబడతాయని ముస్లింల విశ్వాసం. ఇదే రోజున చనిపోయిన తమ పెద్దల్ని స్మరించుకుంటూ పెద్దల పండుగ నిర్వహించుకుంటారు. అంతేకాదు ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా పవిత్ర మక్కా యాత్ర చేయాలన్నది మత విధి. అది ఈ పర్వదినం నాడే చేయడం జరుగుతుంది.
ఈ పండుగలోనే హజ్‌యాత్ర...
ఇస్లాం మతంలోని ఐదు మూల స్తంభాల్లో హజ్ యాత్ర ఒకటి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, హజ్ యాత్రతో మొదలవుతుంది. ఇస్లాం క్యాలెండరులో చివరి నెల ‘జిల్‌హిజ్’. ఈ నెల 9వ రోజున హజ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా మక్కా, మదీన క్షేత్రాలను దర్శించుకుంటారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు, ఆధ్యాత్మిక శుద్ధికి సంకేతం. ఇది కేవలం ఓ యాత్ర మాత్రమే కాదు –ఇది ఆత్మాన్వేషణకు ఆరంభమైన సాధన. తనలోని స్వార్థాన్ని వదిలి, మానవతా మార్గంలో పయనించాలనే సంకల్పంతో చేసే యాత్ర ఇది. ఆ మరుసటి రోజునే బక్రీద్ జరుపుకుంటారు.
నిరుపమానమైన త్యాగానికి
ప్రతీక– ఖుర్బానీ...
మక్కా నగరంలో హజరత్ ఇబ్రహీం ప్రవక్తకు ముదిమి వయసులో కలిగిన ముద్దుల పుత్రుడు ఇస్మాయిల్‌ను అల్లాహ్‌కు బలిదానం చేసేందుకు సిద్ధమైన పవిత్ర ఘటనను స్మరిస్తూ బక్రీద్ నిర్వహిస్తారు. చివరికి, అల్లాహ్ ప్రత్యక్షమై, ఇస్మాయిల్ బదులు ఒక పొట్టేలును ఖుర్బానీ చేయాలని ఆదేశించాడు. అప్పటి నుంచి ఈ పండుగను జీవన త్యాగానికి జ్ఞాపకంగా జరుపుకుంటూ వస్తున్నారు.
ఈద్ నమాజ్ ఇలా..
ఖుర్బానీ ఎవరు, ఎలా చేయాలి
బక్రీద్ పండుగలో ఖుర్బానీ అత్యంత పవిత్రమైన ఆచారం. దానిని ధనంతో కాదు, మనసుతో చేసే త్యాగమే నిజమైన అర్పణ. ఖుర్బానీ ఇచ్చిన పొట్టేలు మాంసం మూడు భాగాలుగా విభజించి పేదలు, బంధువులు, మూడో భాగాన్ని తామే తీసుకోవాలి. చనిపోయిన వారి పేరుతో ఖుర్బానీ చేయాలంటే ఆ మాంసం పూర్తిగా ఇతరులకే పంచాలి. ఇది కేవలం మాంసం పంచడం కాదు, మానవతా భావన పంచడంగా భావిస్తారు. 52 తులాల వెండి లేదా 7.5 తులాల బంగారం కలిగిన ముస్లింలు విధిగా ఖుర్బానీ చేయాలి.

విశ్వాసానికి త్యాగానికి ప్రతీక

విశ్వాసానికి త్యాగానికి ప్రతీక