పర్లాకిమిడి: జిల్లాలోని గుమ్మా బ్లాక్ సెరంగో పోలీసు స్టేషన్ పరిధిలో బుభుని పంచాయతీ సిత్రగుడ గ్రామానికి చెందిన యువకుడు బిర్సన్‌గోమాంగో (34) తన నాటుతుపాకీలో గుళ్లను లోడ్ చేస్తుండగా ఆకస్మికంగా పేలి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో నాటు తుపాకీ పేలుడుకు ఇరుగు పొరుగు వారు వచ్చి చూడగా బిర్సన్ గోమాంగో రక్తపుమడుగులో పడి కనిపించాడు. కొంతకాలంగా బిర్సన్ గొమాంగో ఒంటరిగా గ్రామంలో నివసిస్తున్నాడు. ఆయన భార్య పిల్లలు వేరే గ్రామంలో నివసిస్తున్నారు. ఆదివారం అతను పొలానికి వెళ్లి తిరిగి వచ్చి నాటు తుపాకీ తుడిచి గుండు లోడు చేస్తుండగా పేలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సబ్ డివిజన్ పోలీసు అధికారి మాధవా నంద నాయక్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బిర్సన్ గోమాంగో శవాన్ని పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేసి వారి బంధువులకు అప్పగించారు. దీనిపై సెరంగో పోలీసు ఠానాలో ఒక కేసును నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ ప్రమోధ్ కుమార్ తెలిపారు.
నలుగురు అనాథ బాలలపై ఔదార్యం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మోహనా బ్లాక్‌లో ఖరికుటి గ్రామంలో జలేశ్వర్ మల్లిక్, ఆయన భార్యరాజేశ్వరీ మల్లిక్ ఇటీవల స్వర్గస్థులవ్వడంతో వారి నలుగురు సంతానం అనాథలయ్యారు. వారు చద్మనాథ్ క్రిస్ మల్లిక్ (13), పప్పు మల్లిక్ (11), ఆడపిల్ల సురో మల్లిక్ (8), ఆడపిల్ల రిక్కి మల్లిక్ (5). తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి పెద్దఅక్క వివాహిత శిఫానీ మల్లిక్ వారిని ఆశ్రయం కల్పించింది. అయితే వారి పెద్దక్క ఆర్థిక పరిస్థితి బాగోలేనందున వారి పోషణ కష్టతరమైంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా శిశు సురక్షా సమితి అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని డి.సి.పి.యు. సిబ్బంది నరేష్ నాయక్, ఎ.రవికుమార్ (సి.హెచ్.ఎల్.), డెస్టర్ శిశు సురక్షా సంస్థ కార్యకర్తలను మోహన పంపించి వారిని పర్లాకిమిడి కలెక్టరేట్‌కు తీసుకువచ్చి శిశు సంక్షేమ సమితి అధికారులకు అప్పగించారు. జిల్లా చైల్డ్ వేల్ఫేర్ అధికారి ఆదేశాల మేరకు వారిని జోరావులో ఉన్న శిశు సంరక్షణ సంస్థ, డెస్టర్ హోం (మోహాన)కు తరలించినట్టు తెలియజేశారు. ఈ బాలలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి ఉచిత వసతి కల్పిస్తున్నట్టు అధికారులు తెలియజేశారు.
సర్టిఫికెట్ల ప్రదానం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో జన శిక్షాన్ సంస్థాన్ (జె.ఎస్.ఎస్.) ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, డ్రాపౌట్స్ ఔత్సాహిక జనరల్ అభ్యర్థులకు డ్రైవింగ్ కోర్సుల్లో శిక్షణ మూడు నెలలపాటు అందించింది. లైట్ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులకు సోమవారం నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లను ఆర్.టీ.ఓ అధికారులతో అందించారు. ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు వంద మందికి పాతపట్నం రోడ్డులో ఉన్న కార్యాలయం ప్రాంగణంలో సోమవారం సర్టిఫికెట్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమానికి జూనియర్ మోటారు వెహికల్ అధికారి, జె.ఎస్.ఎస్ చైర్మన్ అడ్డాల జగన్నాథ రాజు, డైరెక్టర్ జీవన్ దాస్, తదితరులు పాల్గొన్నారు. జె.ఎస్.ఎస్ కేవలం డ్రైవింగ్ శిక్షణతోపాటు మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు కూడా అందిస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమానికి భారత నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ సపోర్టు నిచ్చిందని జీవన్ దాస్ తెలిపారు.
ఇలా ఉంటే.. వ్యాధులు రావా?
పర్లాకిమిడి: గజపతి జిల్లాకు 125 కిలో మీటర్ల దూరంలో ఉన్న మోహనా బ్లాక్ అడవ గ్రామ పరిసరాలు వ్యర్థాలు, ఎక్కడపడితే అక్కడ పారవేసిన చెత్త అపరిశుభ్రంతో నిండిపోయింది. గతవారం రోజులుగా అనేక మంది డెంగీ, డయేరియోతో మోహనా సీహెచ్‌సీ, బరంపురం మెడికల్‌కు అడవ ప్రజలు చికిత్స కోసం తరలివెళ్తున్నారు. మోహనా నియోజకవర్గంలో అడవ పంచాయతీ అధికారులు, మోహనా బ్లాక్ స్వస్థ సేవా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్వాసన ప్రబలి వాంతులు, విరేచనాలతో పలువురు బాధపడుతున్నారు. దీనిపై మోహనా బీడీఓ రాజీవ్ దాస్ తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నాటు తుపాకీ పేలి యువకుడు మృతి


