
నాటిక పోటీల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరిస్తున్న శంకరశర్మ తదితరులు
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ ఇంద్రపుష్కరిణి ప్రాంగణంలోని శ్రీ వైజయంతి ఉత్సవ వేదిక లో ఈనెల 25, 26, 27 తేదీల్లో జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ప్రధానార్చకులు, శ్రీసుమిత్ర కళా సమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం అరసవల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శంకరశర్మ నాటిక పోటీల వివరాలను వెల్లడించారు. ఈనెల 25వ తేదీ శనివారం సాయంత్రం 7 గంటల నుంచి కమనీయం, అక్కఅలుగుడు–చెల్లి సణుగుడు, 26వ తేదీ సాయంత్రం అతీతం, బరిబత్తల రాజు, మృత్యుపత్రం, ఈనెల 27న సాయంత్రం కొత్త పరిమళంచ ది లాస్ట్ జడ్జిమెంట్ పేరిట నాటికలు ప్రదర్శిస్తారని తెలిపారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి చెందిన ఆహ్వానపత్రికలను శ్రీసుమిత్ర కళాసమితి ప్రతినిధులంతా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండవల్లి రవి, నక్క శంకరరావు, గుత్తు చిన్నారావు, ప్రధాన విజయరామ్, డి.పార్ధసారధి, వివిఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.