
రెల్లి కులానికి మూడు శాతం రిజర్వేషన్లు అమలుచేయాలి
వించిపేట(విజయవాడపశ్చిమ):ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రెల్లి, వాటి ఉప కులాల వారికి మూడు శాతం జనరల్ రిజర్వేషన్ అమలు చేయాలని రెల్లి ఇంటలెక్చ్యువల్ ఫోరం అధ్యక్షుడు బండి ఆదిసురేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిట్టినగర్‌లోని కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ కులాల్లో రెల్లి జాతి అత్యంత వెనుకబడి ఉందన్నారు. గతంలో 1999 నుంచి 2004 వరకు అమల్లో ఉన్న ఎస్సీ వర్గీకరణలో దళితుల్లో అట్టడుగును ఉన్న రెల్లి జాతికి సంబంధించిన 12 ఉపకులాల వారికి ‘ఏ’ గ్రూపును కేటాయించి ఒక శాతం రిజర్వేషన్లను కల్పించారన్నారు. అది కూడా మహిళలకు మాత్రమే కేటాయించారని, అందులో వారు లేనిపక్షంలో ‘బి’ గ్రూప్‌కు చెందేలా రోస్టర్ విధానంలో వర్గీకరణ చేయడం జరిగిందన్నారు. దీంతో రెల్లి జాతిలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక పలు ఇబ్బందులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది రెల్లి కులస్తులు ఉన్నారని, వారికి మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తేనే రెల్లి జాతి మిగతా ఎస్సీ కులాలతో పాటు అభివృద్ధి చెందుతుందన్నారు. ఫోరం రాష్ట్ర నాయకులు మీసాల ఏడుకొండలు, జనరల్ సెక్రెటరీ నిమ్మకాయల రమణమూర్తి, బొర్రా శ్రీను, వడ్డాది శ్రీనివాసరావు, ముత్యాల మారుతి, దనాల శ్రీనివాసరావు, పాలెపు శివ, ధనాల రాఘవేంద్ర, చెన్నా జయరాం తదితరులు పాల్గొన్నారు.
రెల్లి ఇంటలెక్చువల్ ఫోరం
అధ్యక్షుడు ఆదిసురేంద్ర