
పీఎంశ్రీ పాఠశాలల్లో సంగీత పాఠాలు
● పరికరాల కొనుగోలుకు నిధులు ● విద్యార్థులకు అందుబాటులో దిన పత్రికలు
మామడ: ప్రభుత్వం, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాఠ్యాంశాలతోపాటు సంగీతం, సమకాలీన జ్ఞానాన్ని అందించే దినపత్రికలను చదివే అవకాశాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ లక్ష్యంతో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం కింద ఎంపికై న పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా సంగీత శిక్షణ, దినపత్రికల సరఫరా కోసం నిధులు, సంగీత పరికరాలు, శిక్షకుల నియామకం జరుగుతోంది.
సాంస్కృతిక అవగాహన..
ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో సంగీతాన్ని తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా విద్యార్థుల సృజనాత్మకత, మానసిక సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యం ఉంది. జిల్లాలోని 20 పీఎంశ్రీ పాఠశాలల్లో 9 పాఠశాలలకు తబలా, హార్మోనియం, వయోలిన్, బ్యాండ్, తాళాలు వంటి సంగీత పరికరాలను అందించారు. కుంటాల మోడల్ స్కూల్, జెడ్పీహెచ్‌ఎస్ మస్కాపూర్, ఆశ్రమ పాఠశాల భైంసా పాఠశాలలు ఈ సౌకర్యాన్ని పొందాయి. సంగీత శిక్షణ ద్వారా విద్యార్థులలో ఒత్తిడి తగ్గడం, ఏకాగ్రత, సాంస్కృతిక అవగాహన పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
శిక్షణకు శిక్షకుల నియామకం
సంగీత శిక్షణను నాణ్యమైన రీతిలో అందించేందుకు, పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రత్యేక శిక్షకులను నియమించే ప్రక్రియ జరుగుతోంది. ఒక్కో శిక్షకుడికి ఆరు నెలలు నెలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు. ఈ శిక్షకులు విద్యార్థులకు తబలా, వయోలిన్, హార్మోనియం వంటి సంగీత వాయిద్యాలలో నైపుణ్యం కల్పించడంతోపాటు, సంప్రదాయ, ఆధునిక సంగీత రీతులను బోధిస్తారు.
పాఠశాలల అభివృద్ధికి నిధులు
పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.కోటి నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులతో సంగీత పరికరాలు, దినపత్రికల సరఫరాతోపాటు మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాల అభివృద్ధి, డిజిటల్ విద్యా సామగ్రి వంటి అంశాలను బలోపేతం చేస్తారు. ఈ చర్యలు పాఠశాలలను ఆధునిక విద్యా కేంద్రాలుగా మార్చడంతోపాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్య, సాంస్కృతిక, సమకాలీన జ్ఞానాన్ని అందిస్తాయి.
సంగీతంలో శిక్షణ
పీఎంశ్రీ పథకంలో ఎంపికై న పాఠశాలలకు సంగీత పరికరాలు అందించడం జరిగింది. చదువుతోపాటు విద్యార్థులకు సంగీతం నేర్పించడం ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికితీయవచ్చు. విద్యార్థులకు కళలపై ఆసిక్తి పెరుగుతుంది. – రామారావు, డీఈవో
సమకాలీన జ్ఞానం..
పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు సమకాలీన జ్ఞానాన్ని అందించేందుకు దినపత్రికల సరఫరాకు 2025–26 సంవత్సరానికి ప్రత్యేక నిధులను కేటాయించారు. జిల్లాలోని 20 పాఠశాలలకు ఒక్కొక్క దానికి రూ.10 వేల చొప్పున, మొత్తం రూ.2 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ దినపత్రికలతోపాటు మూడు పిల్లల పత్రికలను కొనుగోలు చేస్తారు. తెలుగు పత్రికకు రూ2,500, హిందీ/ఉర్దూ పత్రికకు రూ.2,500, ఆంగ్ల పత్రికకు రూ.2 వేలు, పిల్లల పత్రికలకు రూ.3 వేలు కేటాయించారు. ఈ పత్రికలను 10 నెలలు గ్రంథాలయంలో అందుబాటులో ఉంచడం, విద్యార్థులకు ప్రత్యేక పఠన పీరియడ్ కేటాయించడం ద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలపై అవగాహన కల్పిస్తారు. ఈ చర్య విద్యార్థుల పఠన నైపుణ్యం, సమాచార గ్రహణ శక్తిని పెంపొందిస్తుంది.

పీఎంశ్రీ పాఠశాలల్లో సంగీత పాఠాలు