
అటవీ గ్రామాలకు రవాణా మెరుగుపర్చాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని మారుమూల అటవీ, గిరిజన గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యం మెరుగుపచ్చాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అటవీ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. మొత్తం 16 రహదారి ప్రాజెక్టులపై చర్చించారు. 9 ప్రాజెక్టులకు అటవీ అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన 7 ప్రాజెక్టుల విషయంపై డాక్యుమెంటేషన్, నివేదికలు పూర్తి చేయని కారణంగా పరిశీలనను వాయిదా వేశారు. అటవీ చట్టాలను పాటిస్తూ గ్రామాల మధ్య రహదారి కనెక్టివిటీ, విద్యుత్, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కడెం మండలం రాంపూర్ మైసంపేట్ పునరావాల గ్రామ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, అటవీ అధికారులు నాగినిభాను, రేవంత్‌చంద్ర, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సాలియనాయక్, గిరిజన సంక్షేమ అధికారి అంబాజి, ఏడీ సుదర్శన్, తహసీల్దార్లు పాల్గొన్నారు.