చదువుల ఒడి.. మస్కాపూర్‌ బడి | - | Sakshi
Sakshi News home page

చదువుల ఒడి.. మస్కాపూర్‌ బడి

Jul 3 2025 7:25 AM | Updated on Jul 3 2025 7:25 AM

చదువు

చదువుల ఒడి.. మస్కాపూర్‌ బడి

● జిల్లాలోనే ప్రత్యేకత గల పాఠశాల ● విద్యార్థుల సంఖ్యలో ప్రథమం ● క్రీడల్లోనూ పలువురి రాణింపు

ఖానాపూర్‌: పీఎంశ్రీకి ఎంపికై న మండలంలోని మస్కాపూర్‌ ఉన్నత పాఠశాల బోధనలో ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా నిలుస్తోంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో కొనసాగుతోంది. జిల్లాలోనే అత్యధికంగా 780 మంది విద్యార్థులున్న పాఠశాలగా గుర్తింపు పొందింది.

‘పది’ ఫలితాల్లో ఉత్తమం

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటుతోంది. గతేడాది ఎస్సెస్సీ పరీక్షలకు 129 మంది విద్యార్థులు హాజరుకాగా, 56 మంది 500కు పైగా మార్కులు సాధించగా, ఉమ్మడి జిల్లాలోనే ఈ ఘనత సాధించిన ఏకై క పాఠశాలగా గుర్తింపు దక్కించుకుంది. సెలవురోజులతో పాటు పాఠశాల పని వేళలకంటే ముందు, తర్వాత గంట పాటు ప్రత్యేక తరగతుల నిర్వహణే విద్యార్థుల విజయరహస్యం. నవంబర్‌ చివరి వరకు సిలబస్‌ పూర్తి చేసి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. డిసెంబర్‌ మొదటి వారం నుంచి ఉదయం 8గంటల నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. వీరికి ప్రత్యేకంగా రాత్రి 8గంటల వరకు స్టడీ అవర్స్‌ నిర్వహిస్తారు.

ఎన్‌ఎంఎంఎస్‌ ఫలితాల్లోనూ..

నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి అధికసంఖ్యలో ఎంపికవుతున్నారు. 2024–25లో నలుగురు, 2023–24లో 19మంది, 2022–23లో 18మంది, 2021–22లో 17మంది, 2020–21లో 24మంది, 2019–20లో 14మంది, 2018–19లో 12మంది, 2017–18లో ఏడుగురు, 2016–17లో ఒకరు, ఇలా ఇప్పటివరకు 116మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాల ఘనతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టీశాట్‌లో గతేడాది జూన్‌లో పాఠశాల విజయగాథను ప్రసారం చేసింది. వివిధ ప్రతిభా పరీక్షల్లోనూ విద్యార్థులు ముందు వరుసలో నిలుస్తున్నారు.

మానసిక ప్రశాంతత కోసం..

ధ్యానంతో విద్యార్థులకు మానసిక ప్రశాంతతను కలిగిస్తే విద్యలో చక్కగా రాణిస్తారని భావించి రోజూ ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాల పాటు ఉపాధ్యాయులు ధ్యానం చేయటంలో మెళకువలు నేర్పుతున్నారు. మస్కాపూర్‌ నివాసి ఉప్పు సాయిరాం రూ.లక్ష వెచ్చించి ఆర్‌వో ప్లాంట్‌ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యత ఓ ఉపాధ్యాయడు తీసుకున్నారు.

అడ్మిషన్ల కోసం తీవ్ర పోటీ

పాఠశాలలోని ప్రత్యేకతల కారణంగా అడ్మిషన్ల కో సం తీవ్ర పోటీ ఉంది. కొన్నేళ్లుగా నో అడ్మిషన్స్‌ బో ర్డు పెట్టాల్సి వస్తోంది. ఈ పాఠశాలలో తమ పిల్లల ను చేర్పించడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులూ పోటీ పడటం విశేషం. సుదూర ప్రాంతాలైన బాసర, జగిత్యాల, మంచిర్యాల నుంచి కూడా అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

ఆటల్లోనూ మేటి..

ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి ఆటల పోటీల్లో రాణిస్తున్నారు. పాఠశాల పనివేళలకు ముందు, తర్వాత విద్యార్థులను బ్యాచ్‌లు విభజించి వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని వెయిట్‌ లిఫ్టింగ్‌ గేమ్‌ సాధనాలున్న ఏకై క పాఠశాలగా గుర్తింపు పొందింది. విద్యార్థులు జిల్లా, జోనల్‌, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధిస్తున్నారు.

రాష్ట్రస్థాయిలో బెస్ట్‌ స్కూల్‌ అవార్డు

పాఠశాలలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైబీజ్‌ స్వచ్ఛంద సంస్థ రాష్ట్రస్థాయి ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేసి అవార్డుతో సత్కరించింది. ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సన్మానించారు. ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యా వలంటీర్లను నియమించి గ్రామ నిధుల నుంచి వారికి వేతనాలిస్తున్నారు.

మానవతా విలువల పెంపు

చిన్నతనం నుంచే విద్యార్థుల్లో మానవతా విలువలు, పెద్దల పట్ల గౌరవభావం పెంపొందేలా ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా మాత–పిత వందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి ఆశీర్వాదం తీసుకునేలా చూస్తున్నారు. ప్రతీ విద్యార్థి గుప్పెడు బియ్యం వారంపాటు ఇంటి నుంచి తెచ్చి సేకరిస్తారు. అనంతరం వాటిని అతి పేద కుటుంబానికి అందజేస్తారు. ఇలా రెండు కుటుంబాల వారికి 30కిలోల బియ్యం, రూ.వెయ్యి చొప్పున ఇచ్చారు. వరదబాధితులు, ఆపదలో ఉన్న వారికీ విద్యార్థులు తలా కొంత పోగు చేసి ఆర్థికసాయం చేస్తున్నారు.

చదువుల ఒడి.. మస్కాపూర్‌ బడి 1
1/1

చదువుల ఒడి.. మస్కాపూర్‌ బడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement