గహ్లోత్‌ను కలిసిన పైలట్‌

Sachin Pilot  Ashok Gehlot Meet After Congress Truce - Sakshi

సీఎల్పీ భేటీలో ఒక్కటైన నేతలు

జైపూర్‌ : కాం‍గ్రెస్‌ పార్టీ అగ్ర నాయకత్వంతో సంప్రదింపుల అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరిన తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ను గురువారం ఆయన నివాసంలో కలిశారు. పైలట్‌ తిరుగుబాటుతో రాజస్తాన్‌లో నెల రోజులు పైగా రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అశోక్‌ గహ్లోత్‌ నివాసంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశానికి సచిన్‌ పైలట్‌ హాజరయ్యారు. పైలట్‌ను సాదరంగా ఆహ్వానించిన గహ్లోత్‌ చిరునవ్వులు చిందిస్తూ యువనేతతో కరచాలనం చేశారు. ఈ భేటీలో ఇరువురు నేతలు పక్కపక్కనే కూర్చున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో గహ్లోత్‌ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ వెల్లడించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, పైలట్‌ సహా ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాధ్రాలతో సంప్రదింపుల అనంతరం పైలట్‌ సొంతగూటికి తిరిగివచ్చేందుకు అంగీకరించిన సంగతి తెలసిందే. పైలట్‌ పార్టీ ముందుంచిన ప్రధాన డిమాండ్లనూ నెరవేర్చుతామని హైకమాండ్‌ ఆయనకు హామీ ఇచ్చింది. రెబెల్‌ నేతలు తిరిగి పార్టీలోకి రావడంతో వారిని మన్నించి ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కోరారు. మరోవైపు రాజస్తాన్‌లో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం రాజస్తాన్‌కు పంపింది. 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్‌ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్‌ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక విపక్ష బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు. చదవండి : రాజస్తాన్‌: కుటుంబ పెద్దపై అలకబూనాం అంతే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top