Viral Video: రోడ్లను ఆ నటి బుగ్గలతో పోలుస్తూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Roads Like Katrina Kaifs Cheeks: Rajasthan Ministers Video Goes Viral - Sakshi

జైపూర్‌: సాధారణంగా రాజకీయ నేతలు తమ ప్రసంగాలలో స్థానిక సమస్యలను ఒక్కో రీతిలో పోల్చి వ్యాఖ్యలు చేస్తారు. ఒక్కోసారి ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉంటే మరికొన్నిసార్లు వివాదాస్పదంగాను మారుతుంటాయి. తాజాగా, రాజాస్తాన్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్‌ గుదా ఝాంజును జిల్లాలోని తన నియోజక వర్గం ఉదయ్‌పూర్‌వాటిలో బహిరంగ సమావేశం నిర్వహించారు.

దీనిలో పెద్ద సంఖ్యలో స్థానికులు హజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి ప్రసంగిస్తూ.. తన నియోజక వర్గంలోని రోడ్లు బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ బుగ్గల మాదిరిగా ఉన్నాయని అ‍న్నారు. ఈ వ్యాఖ్యలతో అక్కడున్నవారు పెద్దగా నవ్వారు. మంత్రిగారి వ్యాఖ్యలపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, అశోక్‌ గెహ్లత్‌ నూతన మంత్రివర్గ కూర్పులో మూడు రోజుల క్రితం రాజేంద్రసింగ్‌ గుదాకు సైనిక్‌ కల్యాణ్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి  శాఖలను అప్పగించారు.

ప్రస్తుతం ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంకగాంధీ స్పందించాలని కామెంట్‌లు చేస్తున్నారు. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు ప్రాముఖ్యత ఉంటుందని పలుసభల్లో ప్రియాంక గాంధీ తెలిపారు.

ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయా దుమారాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా కొందరు మంత్రులు, నాయకులు ఇదే విధంగా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2005లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌ రహదారిని త్వరలో నటి హేమమాలిని బుగ్గల మాదిరిగా మారుస్తామని వ్యాఖ్యలు చేశారు.

దీనిపై పెద్ద దుమారం చెలరేగడంతో ఆతర్వాత దీన్ని ఖండించారు. తన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు కావాలనే వక్రీకరించాయన్నారు. 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్‌ పాండె ప్రతాప్‌గఢ్‌జిల్లాలోని రోడ్లను హేమమాలినీ, మాధురీ దీక్షిత్‌ చెంపల మాదిరిగా నిర్మిస్తామని అన్నారు. దీంతో అప్పటి సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఆయనను పదవీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top