ఢిల్లీలో పది రోజులుగా ఆందోళనలు.. అయినా నోరు విప్పని ప్రధాని మోదీ
ఇది ఆయనలోని బలహీనత, అసమర్థత, అనిశి్చతి, అభద్రతా భావాన్ని సూచిస్తుంది
మంథన్ సంవాద్‌లో ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ ధ్వజం
ఏపీలో గత ఎన్నికల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్‌పై అనుమానాలు: జర్నలిస్టు పూనమ్ అగర్వాల్
ఈసీ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని వెల్లడి
విద్వేష ప్రసంగాలు, దుర్భాష మధ్య తేడా ఉంది: న్యాయవాది షారూఖ్ ఆలం
మంథన్ సంవాద్–2026లో వివిధ అంశాలపై విస్తృత చర్చ
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని నరేంద్ర మోదీ సాధారణంగా ఆన్‌లైన్‌లో ఎంతో చురుగ్గా ఉంటారు. గొప్ప కమ్యూనికేటర్. అయితే, ఢిల్లీ నిరసనల నడుమ పది రోజులుగా ఆయన నోటి నుంచి చిన్న శబ్దం కూడా రాలేదు. ఈ మౌనం బలహీనత, అసమర్థత, అనిశ్చితి, అభద్రతా భావాన్ని సూచిస్తోంది’ అని ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ విమర్శించారు. నిరంతరం మాట్లాడే నాయకుడి నుంచి ఇటువంటి మౌనం అసాధారణమని చెప్పారు. ఏమి మాట్లాడాలో తెలియకపోవడంతో ప్రధాని మౌనంగా ఉన్నారనిదుయ్యబట్టారు.
కేవలం మాటలు మాత్రమే పరిస్థితిని శాంతపరచలేవని, ఆందోళనల్లో పాల్గొంటున్న కాక్రోచ్ జనతా పార్టీ, సమాజం, విద్యార్థులు, కాంగ్రెస్, ఇతర పార్టీల డిమాండ్లకు స్పందించడానికి ప్రధాని నమ్మదగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మంథన్ ఆధ్వర్యంలో ఆదివారం శిల్పకళా వేదికలో నిర్వహించిన సంవాద్–2026 కార్యక్రమంలో ఆయన నవీకా హర్షేతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఢిల్లీలో ఆందోళనను అణచివేయడానికి 245 రైళ్లను రద్దు చేయడంతోపాటు 47 మెట్రో స్టేషన్లను మూసివేసి మొత్తం నగరాన్ని లాక్‌డౌన్ చేశారని కరణ్ మండిపడ్డారు.
ఆందోళన చేస్తున్న ప్రజల అభిప్రాయాలు, ఆందోళనలపై లోతుగా కవరేజ్ కల్పించాల్సిన టీవీ చానెళ్లు ఉద్దేశపూర్వకంగా విస్మరించాయని తప్పుబట్టారు. కేంద్రానికి ఇబ్బందికరమైన సమాచారాన్ని మీడియా చూపించడం లేదని, కేంద్ర ప్రభుత్వం మారితే ధోరణిలో మార్పు రానుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రధాన స్రవంతి మీడియా అపస్మారక స్థితిలో ఉందని, కోలుకోవడానికి ఎక్కువ సమయమేమీ పట్టదన్నారు. 2004లో తాను మోదీతో నిర్వహించిన ఇంటర్వ్యూ కేవలం 2.30 నిమిషాల్లో ముగిసిందని, గోధ్రా అల్లర్ల నేపథ్యంలో ఆయన్ను మాస్ మర్డరర్‌గా జనం చూస్తున్నారని తాను అడిగిన ఓ ప్రశ్నకు మోదీ కోపగించుకుని ఇంటర్వ్యూ అర్ధాంతరంగా ముగించారని గుర్తు చేసుకున్నారు.
అణగారిన వర్గాలపైనే విద్వేషాలు: షారూఖ్ ఆలం, సుప్రీం కోర్టు న్యాయవాది
విద్వేష ప్రసంగాలు, దుర్భాష రెండు వేర్వేరని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది షారుఖ్ ఆలం స్పష్టం చేశారు. అధికారపక్షం అండతో అణగారిన వర్గాలపై విద్వేష ప్రసంగాలు చేసేవారిని, అధికారపక్షాన్ని ప్రశ్నించే అణగారిన వర్గాల ను న్యాయస్థానాలు ఒకేగాట కింద కట్టడం తప్పుడు సమానత్వమేనని అభిప్రాయపడ్డారు. విద్వేష ప్రసంగాలపై సంవాద్‌లో ఆమె మాట్లాడారు. రాజకీయ జనసమీకరణ కోసం విద్వేష ప్రసంగాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
సామూహిక నిఘా రాజ్యాంగ విరుద్ధం: అపార్ గుప్తా
ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నికలు.. అని కేంద్రం ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని సుప్రీం కోర్టు న్యాయవాది, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అపార్ గుప్తా విమర్శించారు. ప్రజలపై పాలకులు సామూహిక నిఘా పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. డిజిటలైజేషన్‌తో అజ్ఞానం పెరుగుతోందనే అంశంపై ఆయన ప్రసంగించారు. సీబీఎస్‌ఈ తీసుకొచి్చన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో అవకతవకలు, దారి పర్యవసానాలను వివరించారు. గ్లోబరీనా సంస్థ వైఫల్యాలతో తెలంగాణలో 20 మంది విద్యార్థులు చనిపోయారని, అదే సంస్థ పేరు మార్చుకుని ఆన్‌్రస్కీన్ మార్కింగ్ కాంట్రాక్టు పొందిందని ఆరోపించారు.
మొఘలుల చరిత్రపై...
మొఘలుల చరిత్రను మతపరమైన ఘర్షణలు, పాలకుల వ్యక్తిత్వాల ఆధారంగా మాత్రమే అర్థం చేసుకోవడం చారిత్రక వాస్తవాలను విస్మరించడమేనని ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఫర్హత్ హసన్ అన్నారు. సంవాద్ కార్యక్రమంలో ‘వై స్టడీ ది మొఘల్ ఎంపైర్? రిఫ్లెక్షన్స్ ఆన్ ఇట్స్ పొలిటికల్ కల్చర్ అండ్ లెగసీ’ అంశంపై ఆయన ప్రసంగించారు. మొఘలుల చరిత్రపై సామాజిక మాధ్యమాలు, సినిమాలు, ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ, పాఠ్యపుస్తకాల్లో వస్తున్న వివరణలను విమర్శనాత్మకంగా పరిశీలించాలని.. చరిత్ర రచనకు ఆధారాలు, శాస్త్రీయ విశ్లేషణ కీలకమన్నారు.
ప్రముఖ రచయిత, ఫిల్మ్‌మేకర్ సుబ్రతో ఛటోపాధ్యాయ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఆవిర్భావం వెనుక తొమ్మిది నెలల దౌత్య ప్రయత్నాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, సైనిక సన్నద్ధత, విముక్తి పోరాట యోధుల త్యాగాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అధికారం కోసం నిరాయుధ ప్రజలపై సైనిక బలాన్ని ప్రయోగించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కాగా, మంథన్ సంవాద్‌లో ఏఆర్ రెహమాన్ సంగీత ప్రస్థానాన్ని భారతదేశ సామాజిక, సాంస్కృతిక పరిణామాలతో అనుసంధానిస్తూ సంగీతకారులు ఎంఆర్ శరణ్, స్వరూప్ మామిడిపూడి, రోహిత్ జరిపిన చర్చ ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: అదే అలజడి


