వన్యప్రాణాలు కాపాడుతూ.. | Sakshi
Sakshi News home page

వన్యప్రాణాలు కాపాడుతూ..

Published Sat, Apr 13 2024 1:15 AM

- - Sakshi

అచ్చంపేట: ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మనుషులు మొదలుకొని పశుపక్షాదులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో.. వాగులు, వంకలు, ఊటకుంటలు, చెలిమెలు, చెక్‌డ్యాంలు పూర్తిగా ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లో వన్యప్రాణులు తాగేందుకు నీరు దొరకడం లేదు. దీంతో అడవి జంతువులు దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, జనావాసాల వైపు పరుగులు తీస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. వ్యవసాయ బావుల్లో పడటమో.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడమో జరుగుతుంది. ప్రతిఏటా ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండేది. ఈసారి మార్చిలోనే ఎండలు ఎక్కువ కావడంతో సమస్య మరింత జఠిలమైంది. అయితే మూగజీవాల దాహం తీర్చడంతోపాటు వాటి మనుగడకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

జంతువుల ఆవాసాల్లోనే..

అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చ.కి.మీ., అభయారణ్యం కాగా 445.02 చ.కి.మీ., బఫర్‌ జోన్‌ ఉంది. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేటర్‌ (ఎన్జీసీఏ) లెక్కల ప్రకారం ప్రస్తుతం 32 పులులు, 176 చిరుతలు ఉన్నాయి. అలాగే 300 ఎలుగుబంట్లు, 10 వేలకుపైగా అడవి పందులు, మచ్చల జింకలు, దుప్పులు, మనుబోతులు, ముళ్ల పందులు, నక్కలు, తోడేళ్లు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లతోపాటు అరుదైన వివిధ రకాల పక్షులు, సర్పాలు, కీటకాలు, వృక్ష సంపద నల్లమల సొంతం. ప్రతిఏటా వన్యప్రాణుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. అయితే ఎండాకాలంలో నీటి ఎద్దడితో అటవీ జంతువుల ఇబ్బందులు వర్ణనాతీతం. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో 4 కి.మీ., పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ., పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జల వనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. బల్మూర్‌ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో మాత్రమే కొద్దిగా నీరు ఉంది. దీంతో అత్యధికంగా వన్యప్రాణులు అక్కడి వస్తుంటాయి.

సోలార్‌ పంపులు

ఏటీఆర్‌లో సోలార్‌ విద్యుత్‌ ద్వారా నడిచే పంపుల ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో 30 సోలార్‌ పంపుల ద్వారా కుంటల్లోకి నీటిని పంపించే సౌకర్యం కల్పించారు. ఎండల తీవ్రతకు కుంటల్లో నీరు ఇంకిపోయే అవకాశం ఉంది. దీంతో సోలార్‌ పంపుల ద్వారా నీటిని కుంటల్లోకి వదులుతున్నారు.

నిరంతరం పర్యవేక్షణ..

రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో 80 వరకు నీటి కుంటలు, చెక్‌డ్యాంలు, పర్కులేషన్‌ ట్యాంక్‌లు, ఫాంపాండ్లను ఏర్పాటు చేశారు. నీటి ఊట ఉన్న ప్రదేశంలో బావిలా గుంత తవ్వి నీరు పడగానే వన్యప్రాణులు సులువుగా దిగి నీరు తాగేలా ర్యాంపు తయారు చేస్తారు. 3 మీటర్ల లోతు, 10 మీటర్ల వెడల్పుతో గుంత తవ్వుతారు. అందులోకి స్వచ్ఛమైన నీరు ఊటల ద్వారా చేరుతుంది. రెండు వైపులా ర్యాంపుల ఏర్పాటుతో వన్యప్రాణులు అందులోకి దిగి నీరు తాగుతాయి. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో 20 వరకు ఏర్పాటు చేశారు. వీటిని ప్రతి రెండ్రోజులకోసారి బేస్‌ క్యాంపు సిబ్బంది, బీట్‌ అధికారులు పర్యవేక్షిస్తారు.

కుంటలో నీరు తాగుతున్న అటవీ జంతువులు

నల్లమలలో సాసర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న అటవీ శాఖ

సహజ సిద్ధంగా నీళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు

ఎండలు పెరగడంతో ఎండుతున్నవాంగులు, చెక్‌డ్యాంలు, కుంటలు

దాహార్తి తీర్చుకునేందుకు జనావాసాల్లోకి పరుగులు

శివారులో అడవి జంతువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అధికారుల సూచన

Advertisement
Advertisement