
తమిళనాడు ప్రభుత్వం తాజాగా కలైమామణి అవార్డ్స్‌ను ప్రకటించింది. సాహిత్యం, సంగీతం, నాటకం వంటి రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించి ఈ అవార్డ్‌తో గౌరవిస్తారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను ఈ అవార్డ్‌కు ఎంపికైన వారి జాబితాను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే నెలలో చెన్నైలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలో అత్యున్నత పౌర పురస్కారంగా 1954 నుంచి ఈ అవార్డ్స్‌ను అందిస్తున్నారు.
ఈ అవార్డు అందుకోనున్న గ్రహీతలలో నటి సాయి పల్లవి, దర్శకుడు-నటుడు ఎస్.జె. సూర్య, దర్శకుడు లింగుసామి (2021), నటుడు విక్రమ్ ప్రభుతో పాటు మరో ముగ్గురు (2022), సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్, నటుడు మణికందన్ (2023) ఉన్నారు. 2021- 2023 సంవత్సరాలకు సంబంధించి ఈ అవార్డ్ కోసం మొత్తం 90 మంది కళాకారులు ఎంపికయ్యారు. కొరియోగ్రాఫర్, నటుడు శాండీతో పాటు నేపథ్య గాయని శ్వేతా మోహన్ వంటి స్టార్స్ ఉన్నారు. జాతీయ పురస్కారాల విభాగంలో నేపథ్య గాయకుడు కె.జె.ఏసుదాస్‌కు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పురస్కారాన్ని ప్రకటించారు.

1954లో తమిళనాడు ప్రభుత్వం స్థాపించిన తమిళనాడు ఈశై నాటక మండలి (Tamil Nadu Iyal Isai Nataka Mandram) ద్వారా ఈ అవార్డ్ ప్రారంభించబడింది. సంగీతం, నాటకం, నృత్యం, చిత్రకళ, సినిమా, సాహిత్యం వంటి రంగాల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులకు ఈ అవార్డు అందజేస్తారు. ఇది తమిళనాడులో అత్యున్నత కళా పురస్కారంగా భావించబడుతుంది. దక్షిణ భారతదేశంలో కళాకారులకు ఇది ఒక గౌరవ చిహ్నంగా నిలుస్తుంది. కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వైయస్ సుధా రఘునాథన్, వైజయంతీమాలా వంటి ప్రముఖులు ఈ అవార్డును ఇప్పటికే పొందారు.