
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
భీమారం: ప్రకృతి ప్రకోపానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మండలంలోని పోతన్‌పల్లి, బూర్గుపల్లి, నర్సింగాపూర్, కాజిపల్లి గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ‘మాకు రెండెకరాల పొలం ఉంది. మరోఐదెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశాం. కోతకు వచ్చిన సమయంలో ఈదురుగాలులుతో కురిసిన వర్షానికి పంట మొత్తం నేలమట్టమైంది. మీరే ఆదుకోవాలి’ అని పోతన్‌పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు జర్పుల స్వరూప ఎమ్మెల్యే ఎదుట బోరున విలపించింది. అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. ప్రభుత్వం ఆదుకోకపోతే చావే శరణ్యమని కన్నీరు పెట్టుకుంది. ఇంత నష్టం జరిగినా అధికారులు ఎలాంటి సర్వేలు చేయలేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వివేక్ వెంటనే కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫోన్ చేశారు. పంట నష్టం సర్వే చేయాలని సూచించారు. అనంతరం బాధిత రైతులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. 35 శాతం కన్నా ఎక్కువ దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందని తెలిపారు. నష్టపోయిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు పంటలను ప్రత్యక్షంగా చూపి వారి వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇళ్లకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో సర్వే జరిపి బాధితుల పేర్లు కలెక్టర్‌కు అందించాలని తహసీల్దార్ సదానందంను ఎమ్మెల్యే ఆదేశించారు. మామిడి పంటలు కూడా దెబ్బతిన్నాయని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు.
● చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం