వ్యాపారి అదృశ్యం | Sakshi
Sakshi News home page

వ్యాపారి అదృశ్యం

Published Fri, May 10 2024 4:10 PM

వ్యాపారి అదృశ్యం

కౌటాల/కాగజ్‌నగర్‌రూరల్‌: కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి నాగమల్ల సురేష్‌ ఈ నెల 6న అదృశ్యమైనట్లు టౌన్‌ ఎస్సై అంజయ్య గురువారం తెలిపారు. చిట్‌ ఫండ్‌ వ్యాపారం నిర్వహించే సురేష్‌ ఇతరుల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిళ్లు వస్తుండడంతో తట్టుకోలేక ఇంటినుంచి వెళ్లిపోయాడన్నారు. వ్యాపారి భార్య అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇసుక లారీ పట్టివేత

చెన్నూర్‌: పట్టణంలోని జాతీయ రహదారిపై గురువారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు సీఐ రవీందర్‌ తెలిపారు. కోటపల్లి మండలం కొల్లూరు ఇసుక క్వారీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంది. వాహనాల తనిఖీలో భాగంగా లారీని తనిఖీ చేయగా డ్రైవర్‌ మనోరంజన్‌ హజ్రా వద్ద ఎలాంటి వేబిల్లు లభించలేదు. దీంతో లారీని సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు లారీ డ్రైవర్‌ మనోరంజన్‌ హజ్రాతో పాటు లారీ యాజమాని జంగ రవిచంద్రారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. కాగా నెలరోజుల క్రితం ఇదే లారీ పట్టుబడినట్లు సీఐ తెలిపారు.

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

తానూరు: మండలంలోని భోసి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ డి.విఠల్‌ (60) బుధవారం రాత్రి వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం ఉపాధిహమీ పనులకు వెళ్లిన విఠల్‌ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

దాడి కేసులో ఇద్దరికి జైలు

నిర్మల్‌టౌన్‌: ఒకరిపై దాడి చేసిన కేసులో ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు కోర్టు సమన్వయల అధికారి సక్రియ నాయక్‌ తెలిపారు. నిర్మల్‌ రూరల్‌ మండలం తల్వేద గ్రామానికి చెందిన రొడ్డ ఎర్రన్న ఇంటిముందు 2016 నవంబర్‌ 12న అదే గ్రామానికి చెందిన గడ్డం రాజు, అతని తండ్రి గంగన్న చెత్త పారేయడంతో వారిని ప్రశ్నించాడు. దీంతో అతనిపై దాడిచేసి గాయపర్చారు. బాధితుడు నిర్మల్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై అరిఫొద్దీన్‌ కేసు నమోదు చేశారు. ఏపీపీవో రామకృష్ణ తొమ్మిది మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువుకావడంతో నిర్మల్‌ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి అజయ్‌కుమార్‌ నిందితులు గడ్డం రాజు, గంగన్నకు ఐదునెలల సాధారణ జైలు, ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు.

ఇద్దరు వ్యక్తులపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై గురువారం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై లాల్‌సింగ్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన గణేశ్‌ రఫీక్‌ అనే వ్యక్తితో మద్యం తెప్పిస్తూ కాలనీలో అమ్మకాలు జరుపుతున్నాడు. బస్టాండ్‌ వైపు నుంచి 10 లీటర్ల మద్యం తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement