కట్టుబాట్ల పేరు.. మారని తీరు
కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని ఓ తండ్రి కక్ష పెంచుకుని కోడలిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దహెగాం మండలం గెర్రె గ్రామంలో చోటు చేసుకుంది. తలాండి శ్రావణి(22) శివార్ల శేఖర్‌ను ప్రేమించి కులాంతర పెళ్లి చేసుకుంది. శేఖర్ తండ్రి శివార్ల సత్తయ్య కక్ష పెంచుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిండు గర్భిణి అని చూడకుండా గొడ్డలితో దాడి చేసి శ్రావణిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. గ్రామస్తులు ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. కులంలోని ఇతరులు వారిని కార్యక్రమాలకు పిలిస్తే జరిమానా విధిస్తామని కులపెద్దలు తీర్మానం చేశారు. సమాజంపై అవగాహన ఉన్న ప్రజాప్రతినిధి కుటుంబానికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కొందరు తమ కుల దేవతను కాకుండా ఇతర మందిరానికి వెళ్తున్నారని కులపెద్దలు ఆ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. వారితో ఎవరూ మాట్లాడవద్దని, ఇళ్లలోకి వెళ్లవద్దని, పెళ్లిలకు పిలువొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు చాలా గ్రామాల్లో జరుగుతున్నా వెలుగులోకి రావడం లేదు.
కౌటాల(సిర్పూర్): టెక్నాలజీతో పరుగులు పెడుతున్నా సమాజంలో ఇంకా కులం, మతం, ఆర్థిక అంతరాలు తొలగడం లేదు. కారణమేదైనా పరువు, ప్రతిష్టల పేరిట హత్యలు జరుగుతున్నాయి. తమ వారిని కోల్పోయి ఓ వైపు.. హంతకులుగా మారి జైళ్లల్లో మగ్గుతూ మరో వైపు.. రెండు వైపులా కుటుంబాలు క్షోభను అనుభవిస్తున్నాయి. అలాగే ఏటా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
పట్టింపులతో నష్టం
కాలంతోపాటు ఎన్నో విషయాల్లో మార్పు వచ్చినా కులమతాల విషయంలో మాత్రం పట్టింపులను వదలిపెట్టడం లేదు. పిల్లలకు ఇష్ట్రపకారం చదువులు, నచ్చిన ఉద్యోగం చేసే స్వేచ్ఛ ఇస్తున్నా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం కట్టుబాట్లు పెడుతున్నారు. కులాంతర వి వాహాలు చేసుకున్న వారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. ఈ కోవలోనే దహెగాం మండలంలో గర్భిణిని పరువు హత్య చేయడం కలకలం రేపింది. ఏటా జిల్లాలో కులం పేరిట దూషణాలు, కుల బహిష్కరణలు, దాడులు, ప్రతిదాడులు కూడా పె రుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2023లో 24 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా, 2024 లో 34 కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతా ల్లో ప్రజలకు పరువు హత్యలు, కుల బహిష్కరణ వంటి ఘటనల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారనే దానిపై అవగాహన ఉండడం లేదు. ఘటనలు జరిగిన సమయంలో మాత్రమే అధికారులు గ్రామాల్లో అవగా హన కార్యక్రమాల పేరిట హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమ వివాహాలు, కుల బహిష్కరణ, శిక్షలు, చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
దాడులు పెరిగాయి
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి. దళితులు, గిరిజనులకు రక్షణ లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో కుల బహిష్కరణ, పరువు హత్యలు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలి. శ్రావణి కుటుంబానికి పరిహారంతో ఐదెకరాల భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. – ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్,
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కఠిన శిక్షలు తప్పవు
పరువు హత్యలకు పాల్ప డితే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అవగాహన లేకనే ఇలాంటి చర్యలకు పాల్ప డుతున్నారు. కుల బహిష్కరణ చేస్తే కఠిన చర్యలు తప్పవు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రక్షణ కల్పిస్తాం. గ్రామీణ ప్రజలకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తాం.
– ఎండీ వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్
కట్టుబాట్ల పేరు.. మారని తీరు
కట్టుబాట్ల పేరు.. మారని తీరు


