
పోలీసుల విస్తృత తనిఖీలు
ఖమ్మక్రైం: బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ వెల్లడించారు. త్యాగానికి ప్రతికగా ముస్లింలు జరుపుకునే బక్రీద్ కోసం అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్, వెటర్నరీ, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. సామూహిక ప్రార్ధనల సమయాన ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశామని, మసీద్‌లు, ఆలయాలు, చర్చిల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని తెలిపారు. పశువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మతసామర్యానికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించిన సీపీ.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు పోస్టులను నమ్మొద్దని ప్రజలకు పోలీసు కమిషనర్ సూచించారు.