కీలక అంకం ముగిసింది... | Sakshi
Sakshi News home page

కీలక అంకం ముగిసింది...

Published Sun, Nov 12 2023 12:18 AM

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ - Sakshi

● 147మంది.. 215సెట్ల నామినేషన్లు ● ఇక పోలింగ్‌ ఏర్పాట్లపై దృష్టి ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మం సహకారనగర్‌: శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసిందని.. ఇక పోలింగ్‌ ఏర్పాట్లపై దృష్టి సారిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ముగిసే సరికి శుక్రవారం అర్ధరాత్రి దాటగా, ఐదు నియోజకవర్గాల్లో 147మంది అభ్యర్థులు 215సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గానికి 39మంది 59సెట్లు, పాలేరుకు 42మంది 59సెట్లు, మధిరకు 22మంది 33సెట్లు, వైరాకు 16మంది 23సెట్లు, సత్తుపల్లికి 28మంది అభ్యర్థులు 41 సెట్ల నామినేషన్లు అందజేశారన్నారు. ఇందులో జాతీయ, గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించి 32మంది, గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 48, స్వతంత్రులు 67మంది ఉన్నారని తెలిపారు. శనివారం విడుదల చేసిన ఓటర్ల జాబితా ఆధారంగానే పోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

5,120పోస్టల్‌ బ్యాలెట్లు

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. పీఓలు, ఏపీఓలు, పోలీస్‌, బెటాలియన్‌ ఉద్యోగులు, కలెక్టరేట్‌ ఉద్యోగులతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించి 5,120 దరఖాస్తులు ఉండగా, దివ్యాంగులు, వయోవృద్ధులు 2,615 మంది ఇంటి నుంచి ఓటు కోసం దరఖాస్తు సమర్పించారన్నారు. జిల్లాలోని 1,456పోలింగ్‌ బూత్‌లకు గాను 1,295 బూత్‌ల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేస్తామని, ఇందులో 390 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఓటర్లందరికీ ఎపిక్‌ కార్డులు పోస్ట్‌లో పంపిస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు.

అర్హులకు మాత్రమే ఓటుహక్కు

జిల్లాలో దొంగోట్లు ఉనాయనే ఫిర్యాదులపై కలెక్టర్‌ స్పందిస్తూ విచారించాకే అర్హులకు ఓటుహక్కు కల్పించామని తెలిపారు. ఇంటి నంబర్లతో సంబంధం లేకుండా ఓటుహక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిందన్నారు. దీంతో ఖమ్మం వైఎస్సార్‌ కాలనీలోని 3వేల ఇళ్లు, నేలకొండపల్లిలో గుడిసెలు వేసుకుని ఉంటున్న వారికి ఓటుహక్కు లభించిందని తెలి పారు. ఎన్నికల పరిశీలకులు తుషార్‌కాంత మహంతి, కానారామ్‌, సత్యేంద్రసింగ్‌, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement