
ఎకరాకు ఒకటే బస్తా
● యూరియాపై నియంత్రణ ● బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు ● ఏడీఏలకు పర్యవేక్షణ బాధ్యతలు ● ఆందోళనలో జిల్లా రైతులు
కరీంనగర్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం యూరియా వినియోగం తగ్గించడంతోపాటు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోకుండా చర్యలు చేపట్టింది. రైతులు విచ్చలవిడిగా పంట పొలాల్లో యూరియాను వాడడంతో పలు సమస్యలేర్పడుతున్నాయి. దిగుబడి పెంచేందుకు ఉపయోగిస్తున్న యూరియా పంటల ఉత్పత్తులపై ప్రభావం చూపుతోంది. యూరియా వాడకం తగ్గించాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పరిస్థితి మారలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం యూరియా వాడకం తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించింది. ఈ వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు ఒకటే బస్తాను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకటి కన్నా ఎక్కువ బస్తాలు పంపిణీ చేస్తే డీలర్‌షిప్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఏడీఏలకు పర్యవేక్షణ బాధ్యత
జిల్లాలో యూరియా అమ్మకాలను పర్యవేక్షించే బాధ్యతను నలుగురు ఏడీఏలకు అప్పగించారు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి ఏడీఏల ఆధ్వర్యంలో నాలుగు తనీఖీ బృందాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ డివిజన్‌లో చొప్పదండి ఏడీఏ, హుజూరాబాద్‌లో మానకొండూరు ఏడీఏ, మానకొండూరులో హుజురాబాద్ ఏడీఏ, చొప్పదండిలో కరీంనగర్ ఏడీఏకు తనిఖీ బాధ్యతలు అప్పగించారు. వీరు సంబంధిత ఏవోలతో కలిసి ఆయా డివిజన్లలోని ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రోస్ కేంద్రాలతోపాటు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను వారంలో ఒక్కరోజు తనిఖీ చేస్తున్నారు. ఈ పాస్ మెషిన్లు పరిశీలించి ఎరువుల అమ్మకాల వివరాలు పరిశీలిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌రూరల్ మండల పరిధిలోని డీలరు ఓ రైతుకు ఒకే పట్టాదారు పాసుపుస్తకంపై 50 బస్తాలను అమ్మినట్లు అధికారులు గుర్తించారు. తనకు సమాచారం లేకపోవడంతో యూరియా అమ్మానని, మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటానని సదరు డీలరు చెప్పడంతో అధికారులు విడిచిపెట్టారు.
పక్కదారి పట్టకుండా ఉండేందుకే
యూరియా బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానం అమలు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రైతులు పంటల దిగుబడి పెంచేందుకు యూరియాను వినియోగిస్తుండగా అక్రమార్కులు పౌల్ట్రీ, డెయిరీ ఫామ్స్‌ల్లో ఉపయోగిస్తున్నారు. యూరియాతో లిక్కర్ తయారు చేసే అవకాశముండటంతో కంపెనీల యాజమాన్యాలు అడ్డదారిలో సేకరిస్తున్నాయి. కొంతమంది దళారులు రైతులు పేరిట యూరియాను పెద్దమొత్తంలో సేకరించి బ్లాక్‌మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఎకరాకు ఒటే బస్తా ఇవ్వాలనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. ఎకరానికి ఒక బస్తా సరిపోదని, కనీసం రెండు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఙప్తి చేస్తున్నారు.

ఎకరాకు ఒకటే బస్తా

ఎకరాకు ఒకటే బస్తా