
తలుపులమ్మకు భీమేశ్వరస్వామి ఆలయం నుంచి చీర–సారె
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆషాడ మాసోత్సవాలను పురస్కరించుకుని ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆలయ సహాయ కమిషనర్ ఎ.దుర్గాభవానీ చీర–సారె సమర్పించారు. బుధవారం లోవ దేవస్థానానికి చీర–సారెతో వచ్చిన భీమేశ్వరస్వామి దేవస్థానం బృందానికి వేద పండితులు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి చీర సారె సమర్పించిన సహాయ కమిషనర్ దుర్గాభవానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాలను బహూకరించారు.
బిల్లుల చెల్లింపులకు నిధులివ్వండి
కాంట్రాక్టర్ల వినతి
కాకినాడ సిటీ: జిల్లా పరిషత్ గ్రాంట్లతో చేసిన పనుల బిల్లులు తక్షణమే చెల్లించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కాకినాడలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన జెడ్పీ వైస్ చైర్మన్ అనుబాబు, కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్‌కుమార్‌కు వినతిపత్రాలు అందజేశారు. మూడేళ్లుగా జిల్లా పరిషత్ నుంచి వచ్చిన గ్రాంట్లతో అన్ని పనులు పూర్తి చేసినా బిల్లులు విడుదల చేయలేదన్నారు. పెండింగ్ బిల్లులు సత్వరమే మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు కోరారు.