
రెండు పొక్లెయిన్లు సీజ్
పి.గన్నవరం: మండలంలోని మానేపల్లిలంకలో అనుమతులు లేకుండా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్న రెండు పొక్లెయిన్లను కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్ మంగళవారం సీజ్ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో పి.గన్నవరం మండలంలోని యర్రంశెట్టివారిపాలెం, పెదకందాలపాలెం, మానేపల్లిలంకలో ర్యాంపులను తహసీల్దార్ పి.శ్రీపల్లవితో కలిసి ఆర్డీఓ పరిశీలించారు. మానేపల్లిలంకలో ఉన్న పొక్లెయిన్లను సీజ్ చేసి మైన్స్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 15 వరకూ జిల్లాలో ఎక్కడా మట్టి, ఇసుక తవ్వకాలు జరపరాదని కలెక్టర్ ఆదేశించారన్నారు. అక్రమ తవ్వకాలు సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాంపుల్లోకి లారీలు, ట్రాక్టర్లు వెళ్లకుండా బాటలను కట్ చేయించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆయా ర్యాంపుల్లో ఎంత మేరకు అక్రమ తవ్వకాలు జరిపారో డ్రోన్ల ద్వారా సర్వే చేయించి, సంబంధిత వ్యక్తులకు డిమాండ్ నోటీసులు పంపిస్తామని ఆర్డీఓ చెప్పారు.