మంచినీటికి చెడ్డ కష్టం | - | Sakshi
Sakshi News home page

మంచినీటికి చెడ్డ కష్టం

Jun 20 2025 5:57 AM | Updated on Jun 20 2025 5:57 AM

మంచిన

మంచినీటికి చెడ్డ కష్టం

సాక్షి, అమలాపురం: సాగు నీరే కాదు.. గుక్కెడు తాగునీరు అందించడంలో కూడా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. డెల్టా పంట కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయకపోవడం వల్ల శివార్లలో ఖరీఫ్‌ సాగు ఆలస్యం కావడమే కాదు.. తాగునీటి ఎద్దడికి కూడా కారణమైంది. జూన్‌ ఒకటిన డెల్టా కాలువలకు నీరు విడుదల చేసినా లొల్ల లాకుల వద్దనే అడ్డుకట్టలు వేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభావంతో జిల్లాలోని ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాలలోని శివారు ప్రాంతాలకు తాగునీరందించే ప్రాజెక్టులలో నీటి నిల్వలు తగ్గి జనం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.

మున్సిపాలిటీలో తాగునీటి ఇబ్బందులు

అమలాపురం మున్సిపల్‌ సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో నీటి నిల్వలు అడుగంటడంతో పట్టణంలో పలు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు. ఏటా ఇచ్చినట్టుగానే ఈ ఏడాది జూన్‌ 1న పంట కాలువలకు నీరు విడుదల చేస్తారని భావించిన మున్సిపాలిటీ అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేసుకుంది. నడిపూడి వద్ద ఉన్న సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు అమలాపురం – చల్లపల్లి పంట కాలువల ద్వారా నీరు అందాల్సి ఉంది. ఈ కాలువ మీదనే నడిపూడి వద్ద వంతెన నిర్మాణం పేరుతో ఈ నెల 15 వరకు తాగునీరు ఇవ్వలేదు. తరువాత విడుదల చేసినా తొలి వారం రోజులు మురుగునీరు కావడం వల్ల తోడలేదు. ఇక పట్టణంలో ఉన్న రెండు రిజర్వాయర్లకు అమలాపురం – అల్లవరం బెండా కెనాల్‌ ద్వారా తాగునీరు నింపుతారు. ఈ కాలువకు ఇప్పటికీ నీరు విడుదల చేయలేదు. సాధారణంగా 60 రోజుల పాటు నీటి నిల్వలతో ఈ రిజర్వాయర్లు తాగునీరు అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాలువలకు నీరు రాక ఈ మూడు చెరువులకూ పంపింగ్‌ చేసి నింపే పరిస్థితి లేదు. పలు వార్డుల్లో ప్రజలు తాగునీటి కోసం తహతహలాడుతున్నారు. ప్రత్యామ్నాయంగా మున్సిపాలిటీ ట్యాంకర్లతో సరఫరా చేస్తోంది. మున్సిపాలిటీలో పని చేస్తున్న 50 మంది ఇంజినీరింగ్‌ వర్కర్లు 42 రోజులుగా సమ్మెలో ఉండడం కూడా తాగునీటి సరఫరాకు అవాంతరంగా మారింది.

శివార్లలో ఇక్కట్లు

ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి ప్రాజెక్టులో 45 రోజు లు నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు నుంచి ప్రతి రోజూ 1,875 కిలోలీటర్ల తాగునీరు గ్రామాలకు సరఫరా అవుతుంది. ఎస్‌.యానాం ప్రాజెక్టులో మైక్రోఫిల్టర్లు పోవడంతో గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. నీరు కేవలం వాడడానికి తప్ప తాగడానికి పని చేయడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భీమనపల్లి పంచాయతీ ప్రాజెక్టు ఎండిపోవడంతో వారం రోజులు దాని నుంచి నీరు అందడం లేదు. కూనవరం ప్రాజెక్టు చెరువు ఈ నెల 7వ తేదీ నుంచి ఎండిపోవడంతో మండలంలోని కూనవరం, ఉప్పలగుప్తం, వానపల్లిపాలెం, మునుపల్లి కోటిగట్టు, పెదగాడవిల్లి, చిన్నగాడవిల్లి, ఎన్‌.కొత్తపల్లి, కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామ పంచాయతీ పరిధి నాగి చెరువు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ ప్రాంతాల్లో పది రోజులుగా తాగునీరు పూర్తి స్థాయిలో అందడం లేదు.

అడుగంటుతున్న నీటి నిల్వలు

ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ఐ.పోలవరం (ఐలెండ్‌)కు గురువారం నుంచి పంట కాలువల ద్వారా సాగునీరందుతోంది. ఇప్పటికే మురమళ్ల సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. మరో వారం అయితే కానీ నీరు నింపే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే మురమళ్ల, కేశనకుర్రు శివారు ప్రాంతాల్లో తాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదు. ముమ్మిడివరం మండలం పోలమ్మ చెరువులో నీరు తక్కువగా ఉంది. అయితే బోర్లు ఎక్కువగా ఉండడంతో నీరు సరఫరా చేస్తున్నామని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. కాట్రేనికోన మండలం కందికుప్ప, నడవపల్లి, బలుసుతిప్ప మంచినీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శివారలో నీటి ఇబ్బందులున్నాయి. రాజోలు దీవిలోని మలికిపురం, సఖినేటిపల్లిలో తాగునీటి ఇక్కట్లు ఇప్పుడిప్పుడే తొలుగుతున్నాయి. పంట కాలువల ద్వారా నీరందడంతో ప్రాజెక్టులను నీటితో నింపుతున్నారు. గుడిమెళ్లంక, రామేశ్వరం ప్రాజెక్టుల పరిధిలో వారం రోజుల పాటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి.

నీరందించలేక ఎదురుదాడి

తమ నిర్వాకం వల్ల ప్రజలకు తాగునీరు.. రైతులకు సాగునీరు అందకుండా పోతే నీటి కష్టాలకు మున్సిపాలిటీలు.. స్థానిక సంస్థలు కారణమని ఆరోపిస్తూ ఎదురుదాడికి దిగారు కూటమి నేతలు. డెల్టా కాలువలకు జూన్‌ 1న అందించాల్సిన నీటిని 15వ తేదీ వరకూ అందించలేదు. అల్లవరం బెండా కెనాల్‌కు ఇప్పటికీ ఇవ్వలేదు. మురమళ్ల కాలువకు ఇప్పడిప్పుడే నీరు వదులుతున్నారు. ఈ ఏడాది కాలువలకు నీరు ఇవ్వడం ఆలస్యమవుతుందని ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదు. ఇప్పుడు మున్సిపాలిటీలకు ముందుచూపు లేదని ఆరోపిస్తున్నారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో పాటు టీడీపీ నేతలు ఇదే పల్లవి అందుకున్నారు. ఆనందరావు సొంత మండలం చల్లపల్లిలో తాగునీరు అందడం లేదని మహిళలు గురువారం ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేయడం గమనార్హం. అయితే దీనిపై కూటమి నేతలు నోరు మెదపకపోవడం విశేషం. కాలువలకు నీరు విడుదల ఆలస్యమవుతున్నందున కనీసం ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా ప్రత్యామ్నాయంగా తాగునీరు అందించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేపట్టలేదు.

కోనసీమ జిల్లాలో దాహం దాహం

ప్రాజెక్టులలో అడుగంటిన జలాలు

పంట కాలువలకు ఆలస్యంగా

నీరు విడుదల చేయడం వల్లే..

జూన్‌ 1కి రావాల్సిన నీరు

ఇప్పటికీ పలుచోట్ల అందని వైనం

అమలాపురం, ముమ్మిడివరంలో

తాగునీటి ఇబ్బందులు

ప్రత్యామ్నాయ

చర్యలు తీసుకోని ఆర్‌డబ్ల్యూఎస్‌

మంచినీటికి చెడ్డ కష్టం1
1/1

మంచినీటికి చెడ్డ కష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement