రియల్‌ ఆక్వామ్యాన్‌: 27 గంటలకు పైగా ఈత.. టోంగా వృద్ధుడి వీరసాహసం వైరల్‌

Tonga Old Disabled Man Survived After 27 Hours Swimming - Sakshi

పిడుగులు పడ్డట్లు భారీ శబ్ధం.. ఆపై భూ ప్రకంపనలు.. హఠాత్తుగా ముందుకొచ్చిన సముద్రపు అలలతో సునామీని కళ్లారా వీక్షించింది టోంగా. పసిఫిక్‌ మహాసముద్రంలోని అగ్నిపర్వతం బద్ధలైన ఘటనతో ఆ చిన్న ద్వీప దేశానికి తీరని నష్టం వాటిల్లింది. అయితే సముద్రపు అలల్లో 27 గంటలపాటు ఈది.. ప్రాణాలతో బయటపడ్డ ఓ పెద్దాయన సాహసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

గత శనివారం పసిఫిక్‌లోని భారీ అగ్నిపర్వతం హుంగా టోంగ-హుంగ హాపయ్‌ అగ్నిపర్వతం బద్ధలైంది. ఆ ధాటికి సునామీ చెలరేగగా.. ఆ మహాసముద్రం అలలు వేల కిలోమీటర్ల దూరంలోని తీరాలను సైతం తాకాయి. ఇదిలా ఉంటే దగ్గర్లో ఉన్న టోంగాను అతలాకుతలం చేసింది ఈ ఘటన. అయితే సముద్రపు అలల్లో చిక్కుకుపోయిన 57 ఏళ్ల లిసలా ఫోలావ్‌.. తన చావు ఖాయమని అనుకున్నాడు. అలాగని చావుకి లొంగిపోలేదు. ఎలాగైనా బతకాలన్న తాపత్రయంతో వైకల్యాన్ని లెక్కచేయకుండా ప్రయత్నించి గెలిచాడు.  

టోంగా రాజధాని నుకువాలోఫాకు ఈశాన్యంవైపు 8 కి.మీ. దూరంలోఉంది అటాటా అనే ఓ చిన్న దీవి. ఈ దీవి జనాభా 60 మంది. లిసలా ఫోలావ్‌ తన కొడుకుతో పాటు ఆ దీవిలో జీవిస్తున్నాడు.  వైకల్యం ఉన్న ఆ పెద్దాయన సరిగా నడవలేడు కూడా.  సునామీ ఒక్కసారిగా విరుచుకుపడడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా నేల ప్రాంతం వైపు పరుగులు తీశారు. కానీ, ఆ పెద్దాయన మాత్రం పాపం నీటి ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. మొదట ఒడ్డులోని ఓ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడిన ఆ పెద్దాయన.. ఆ టైంలో దూరంగా కనిపిస్తున్న తన కొడుక్కి తన అరుపుల్ని వినిపించాలని ప్రయత్నించాడు. ఇంతలో రెండో అల భారీగా రావడంతో ఆయన సముద్రంలోకి కొట్టుకునిపోయాడు.  

ఇక తన పని అయిపోయిందని నీళ్లలో మునిగిపోతున్న ఆయన.. వచ్చిన కొద్దిపాటితో ఈతతో ప్రాణాల్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ప్రాణ తీపి ఆయన్ని అలా 27 గంటలపాటు ముందుకు తీసుకెళ్లింది. మధ్యలో తొమ్మిదిసార్లు నీటి అడుగుభాగానికి చేరుతూ జీనవర్మణ పోరాటం చేశాడట ఆ పెద్దాయన. చివరికి ఏడున్నర కిలోమీటర్లు ఆపసోపాలు పడుతూ ఈదాక.. టోంగాటపు నేల భాగానికి చేరుకున్నాడు. ఆ టైంలో రెస్క్యూ టీం ఆయన్ని గుర్తించి.. ఆస్పత్రికి తరలించింది. అలా పెద్దాయన మృత్యుంజయుడిగా బయటపడడంతో పాటు సోషల్‌ మీడియాలో హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అంత ఓర్పుతో ఆయన చేసిన ప్రయత్నం గురించి చర్చించుకుంటున్నారు. ఇంకొందరైతే  రియల్‌ లైఫ్‌ అక్వామ్యాన్‌గా ఈ పెద్దాయన్ని అభివర్ణిస్తున్నారు. ప్రయత్నించకుండా ఫలితం ఆశించడం మనిషి నైజం. అది మారనంత వరకు జీవితంలో ముందుకు వెళ్లలేరన్న విషయం ఈ పెద్దాయన కథ ద్వారా స్పష్టమవుతోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే సునామీ ధాటికి లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా ద్వీపదేశం కుదేలు అయ్యింది. ముగ్గురు చనిపోయారని అధికారులు ప్రకటించగా.. తీర ప్రాంతంలోని నివాసాలు, రిసార్టులు ఘోరంగా దెబ్బతిన్నాయి. బయటి ప్రపంచంతో కమ్యూనికేషన్‌ పునరుద్ధరణ కోసం నెల టైం పడుతుందని అంచనా వేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top