మంగళవారం రెన్నెస్ నగరంలో విద్యార్థుల పైకి జల ఫిరంగులు ప్రయోగిస్తున్న పోలీసులు
విద్యకు నిధులు పెంచాలని డిమాండ్
రెండు వారాలుగా బడులు, హైస్కూళ్లూ బంద్!
మైనర్లు సహా 6100 మంది అరెస్ట్!
పోలీసుల దాడిలో పలువురికి గాయాలు
సమర్థించుకున్న మంత్రి
ప్యారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌కు విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యకు మరిన్ని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్ మొత్తమ్మీద విద్యార్థులు ఆందోళనలకు దిగారు. మంగళవారం దేశవ్యాప్తంగా 891 పాఠశాలలు బంద్ అయినట్లు పలు నగరాల్లో సుమారు 86 వేల మంది నిరసన ప్రదర్శనలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థులు హైస్కూళ్లను దిగ్బంధనం చేశారు. మార్సెలీ, స్ట్రాస్‌బర్గ్ వంటి నగరాల్లో ఆందోళనకారులు ప్లకార్డులు, జెండాలు, నినాదాలతో వీధులోకి వచ్చారు. ప్యారిస్‌లోని హెలెనీ బౌషర్ లైసీ(వొకేషనల్ హైస్కూల్) వద్ద విద్యార్థుళు సైకిళ్లు, చెత్తకుండీలతో బారీకేడ్ ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని వందలాది పాఠశాలలు మూతపడ్డాయి.
ప్యారిస్‌లో ఒక ప్రాంతంలోని ఓ చిన్న పాఠశాలలో గత నెల మొదలైన ఈ ఆందోళన అంతకంతకూ పెద్దదై దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. తాము పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ అణచివేతతోనే సమాధానమిస్తోందని ప్యారిస్ హైస్కూల్ టీచర్ సిగ్రిడ్ గెరాడిన్ తెలిపారు. యూనివర్శిటీ విద్యార్థి ఫెలిక్స్ బార్నీ మాట్లాడుతూ పోలీసులు మైనర్లపై కూడా దాడుల చేయడాన్ని ఖండించారు. రెండు వారాలుగా విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించి తమ డిమాండ్ల సాధనకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సుమారు 6,100 మందిని అరెస్ట్ చేసినట్లు, ఇందులో మైనర్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రెండు వారాలుగా విద్యార్థుల ఆందోళనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తూండటం. ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోలు ధరలు పెరిగిపోవడం, ప్రభుత్వాలు ప్రజావసరాల కోసం పెడుతున్న ఖర్చులు తగ్గిపోతూండటంపై ఇప్పటికే సామాన్య ప్రజానీకంలో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉండగా విద్యార్థి ఆందోళనలు దానికి ఆజ్యం పోశాయి. ‘‘విద్యార్థులు దేశ భవిష్యత్తు అంటారుగా... వాళ్లు చెప్పేది వినండి మరి’’ అని ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూండటం పరిస్థితికి అద్దం పడుతుంది.
మరోవైపు ప్రతిపక్ష నేత ఆరులిన్ లీ కాక్ మాట్లాడుతూ విద్యార్థులపై లాఠీలు, రబ్బరు బుల్లెట్లు, టియర్‌గ్యాస్‌లు ఉపయోగంచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ హింస భరించలేనదని వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థి విద్యార్థి ఆందోళనలకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆందోళనకారులపై పోలీసుల చర్యను అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి లారెంట్ నునెజ్ సమరి్థంచుకున్నారు.
నిరసన ప్రదర్శనలు కాస్తా దొమ్మీలుగా మారిపోయాయని, పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగానే స్పందిస్తున్నాయని టీనేజీ యువతపై టియర్‌గ్యాస్, ఇతర ఆయుధాల వాడకాన్ని ఆయన సరైందని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లో వచ్చే ఏడాది మే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు అధ్యక్ష పీఠాన్ని ఎక్కిన మేక్రాన్ మూడోసారి పోటీ చేసే అవకాశం లేకపోవడం గమనార్హం.


