Ukraine And Russia War 2022 Update: Death Report Today - Sakshi
Sakshi News home page

థియేటర్‌పై రష్యా దాడిలో 300 మంది మృతి!

Mar 25 2022 3:56 PM | Updated on Mar 26 2022 5:33 AM

People Dead In Russian Strike On Ukraine Theatre Last Week - Sakshi

ఖర్కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. మార్చి 16న మారియుపోల్‌లో 1,300 మందికి పైగా తలదాచుకున్న ఓ థియేటర్‌ రష్యా బాంబు దాడిలో నేలమట్టమవడం తెలిసిందే. వారిలో కనీసం 300 మందికి పైగా దుర్మరణం పాలైనట్టు తాజాగా తేలింది! కీవ్‌ సమీపంలో ఉక్రెయిన్‌ దళాలకు ఇంధనం సరఫరా చేసే ఓ భారీ ఇంధనాగారాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ఓడరేవుల్లో చిక్కుబడ్డ 67 నౌకలు సురక్షితంగా వెళ్లిపోయేందుకు శుక్రవారం నుంచి అనుమతిస్తామని ప్రకటించింది.

నెలకు పైగా జరుగుతున్న యుద్ధం ఉక్రెయిన్‌ను సంక్షోభపుటంచుల్లోకి నెట్టేసింది. తిండికి, తాగునీటికి కూడా దిక్కు లేక దేశమంతటా జనం అల్లాడుతున్నారు. ఎటు చూసినా నిత్యావసరాల కొరత పీడిస్తోంది.  శవాలను తీసుకెళ్లేవారు కూడా లేకపోవడంతో మారియుపోల్‌ తరహాలో సామూహిక ఖననాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో నాటో నేతృత్వంలో పాశ్చాత్య ‘శాంతిపరిరక్షణ’ దళాలను మోహరించాలన్న ప్రతిపాదనలను రష్యా అనుకూలుడైన బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు.
ఆయుధాలివ్వం: హంగరీ
ఉక్రెయిన్‌కు ఆయుధాలివ్వాలని, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన విజ్ఞప్తిని హంగరీ తోసిపుచ్చింది. అది హంగరీ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ప్రధాని విక్టర్‌ అర్బన్‌ అన్నారు.  పశ్చిమ దేశాలన్నీ తమపై సంయుక్తంగా యుద్ధం ప్రకటించాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ ఆరోపించారు. రష్యా గనక రసాయన ఆయుధాలు వాడితే యుద్ధ స్వరూపమే మారిపోతుందని నాటో సెక్రెటరీ జనరల్‌ జెన్స్‌ స్టోటెన్‌బర్గ్‌ హెచ్చరించారు. యుద్ధంలో ఇప్పటిదాకా 1,351 మంది సైనికులను కోల్పోయినట్లు,  మరో 3,825 మంది సైనికులు గాయపడ్డట్టు  రష్యా ప్రకటించింది.

చర్చల్లో పురోగతి: టర్కీ
రష్యా–ఉక్రెయిన్‌ మధ్య చర్చల్లో పురోగతి ఉందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ చెప్పారు.  ‘‘నాటోలో చేర్చుకోవాలన్న డిమాండ్‌ను వదులుకునేందుకు, రష్యన్‌ను అధికార భాషగా స్వీకరించేందుకు ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉంది.’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement