గాజా ఆక్రమణకు పన్నాగం! | Israel Cabinet approves plans to seize entire Gaza Strip | Sakshi
Sakshi News home page

గాజా ఆక్రమణకు పన్నాగం!

May 6 2025 5:45 AM | Updated on May 6 2025 5:45 AM

Israel Cabinet approves plans to seize entire Gaza Strip

నిరవధిక ప్రణాళికకు ఇజ్రాయెల్‌ కేబినెట్‌ ఆమోదం 

హమాస్‌ను అంతం చేసి, బందీలను విడిపించే దిశగా చర్యలు 

రంగంలోకి దిగాలని వేలాది మంది రిజర్వ్‌ సైనికులకు పిలుపు  

టెల్‌ అవీవ్‌: హమాస్‌ మిలిటెంట్‌ సంస్థను సమూలంగా నాశనం చేసి, గాజా స్ట్రిప్‌ను పూర్తిగా హస్తగతం చేసుకొనే దిశగా ఇజ్రాయెల్‌ అడుగులు వేస్తోంది. మొత్తం గాజా భూభాగాన్ని నిరవధికంగా ఆక్రమించే ప్రణాళికకు ఇజ్రాయెల్‌ మంత్రివర్గం సోమవారం ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం ఓటింగ్‌ నిర్వహించారు. గాజా ఆక్రమణకు కేబినెట్‌ సంపూర్ణ అంగీకారం తెలిపింది. ఇద్దరు సీనియర్‌ అధికారులు ఈ విషయం వెల్లడించారు. అక్కడి నుంచి ఎప్పుడు ఖాళీ చేయాలన్న దానిపై ఇజ్రాయెల్‌ కేబినెట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

అంటే గాజా స్ట్రిప్‌ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఇజ్రాయెల్‌ ఆధీనంలోనే ఉండిపోయే అవకాశాలు లేకపోలేదు. హమాస్‌ను ఓడించి, బందీలను విడిపించడమే లక్ష్యంగా రంగంలోకి దిగాలని వేలాది మంది రిజర్వ్‌ సైనికులకు ఇజ్రాయెల్‌ సైన్యం పిలుపునిచ్చింది. పాలస్తీనా భూభాగంలో అతిత్వరలోనే భీకర స్థాయిలో సైనిక ఆపరేషన్‌ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌ను ఖతం చేయాలన్న పట్టుదలతో ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్‌ నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. గాజాను ఆక్రమించడం అంత సులభం కాదంటున్నారు.

అమల్లోకి ట్రంప్‌ ప్లాన్‌! 
40కిలోమీటర్లకుపైగా పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు ఉండే గాజాను ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాలోని పాలస్తీనా పౌరులను ఇతర దేశాలకు తరలించి, గాజాను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ప్రకటించారు. దీనిపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్‌ మిత్రదేశాలు సైతం తప్పుపట్టాయి. ట్రంప్‌ ప్లాన్‌లో భాగంగానే గాజాను పూర్తిగా హస్తగతం చేసుకోవడానికి ఇజ్రాయెల్‌ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50 శాతం గాజా భూభాగం ఇజ్రాయెల్‌ అధీనంలోకి వచ్చింది. 

మిగిలిన ప్రాంతాన్ని సైతం త్వరలో ఆక్రమించబోతోంది. అయితే, గాజా ప్రజలను ఏం చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. వారందరినీ దక్షిణ గాజాకు తరలించనున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ కేబినెట్‌ తాజా నిర్ణయం పట్ల బందీల తీవ్రస్థాయిలో కుటుంబ సభ్యులు మండిపడ్డారు. హమాస్‌ మిలిటెంట్ల జోలికి వెళితే బందీలెవరూ ప్రాణాలతో మిగలరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాను ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలని కోరుతున్నారు. హమాస్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగా గాజాకు అంతర్జాతీయ మానవతా సాయాన్ని ఇజ్రాయెల్‌ అనుమతించడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement