న్యూయార్క్: అమెరికాలోని ఇల్లినాయీ రాష్ట్రం అరోరా నగరంలో ఉన్న ఓ హిందూ ఆలయంలో కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేసిన ఓ టీనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్వేత జాతి అహంకార సిద్ధాంతాలను అనుసరించే ఇతడు, ఆలయంలోకి వచి్చన భారత సంతతికి చెందిన వారిని పెద్ద సంఖ్యలో చంపాలని కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఉగ్ర చర్యకు పాల్పడే ప్రమాదం, చట్ట విరుద్ధంగా ఆయుధం కలిగి ఉన్నాడనే ఆరోపణలపై ఈ నెల 11వ తేదీన పలటిన్ గ్రామానికి చెందిన అలెగ్జాండ్రోస్ పపోరకిస్ అనే 19 ఏళ్ల టీనేజర్‌ను అరెస్ట్ చేశారు.
అయితే, పపోరకిస్ ఈ దారుణానికి వేదికగా ఎంచుకున్న ఆలయం వివరాలను వారు వెల్లడించలేదు. ఈ నెల 11వ తేదీ, ఆదివారం ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించిన టీనేజర్ అక్కడ పెద్ద సంఖ్యలో చేరిన భక్తులపైకి కాల్పులు జరపాలని కుట్ర పన్నాడు. పపోరకిస్ తన దారుణ పథకాన్ని అమలు చేసే క్రమంలో సమయానికి తుపాకీ పనిచేయలేదు. దీంతో, తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.
జామ్ అయిన తుపాకీని తిరిగి పనిచేయించడమెలాగని ఇంటర్నెట్లో శోధించాడు. టాకో బెల్ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేసే పపోరకిస్ ఓ ఏఆర్ రైఫిల్, 300 రౌండ్ల తూటాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తోపాటు నాజీలు ధరించే క్రాస్‌ను రెడీగా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆలయంలో కాల్పుల ఘటన విషయాన్ని అదే రోజు ఇతడు తోటి ఉద్యోగుల్దిరికి తెలిపాడు.
ఎక్కువ మందిని చంపాలనుకుంటే, తుపాకీ పనిచేయలేదని చెప్పాడు. దీంతో, అప్రమత్తమైన ఆ కొలీగ్ ఈ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు..పపోరకిస్ తిరిగి తన ఇంటి వద్ద నుంచి ఆలయానికి బయలుదేరుతుండగానే వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిలువెల్లా ద్వేషాన్ని నింపుకున్న ఇతగాడు ప్రతిరోజూ సామూహిక హత్యలకు పాల్పడాలని కలలుగనే శ్వేతజాతి ఆహంకార నియో–నాజీగా చెప్పుకుంటూ ఆనందం వ్యక్తం చేసేవాడంటూ పోలీసులు పేర్కొన్నారు.
బుధవారం కోర్టులో హాజరుపర్చగా, ఈ నెల 30వ తేదీ వరకు నిర్బంధంలోనే ఉంచాలని జడ్జి ఆదేశించారు. సకాలంలో స్పందించి, పెను ప్రమాదం నివారించినందుకు షికాగోలోని భారత కాన్సులేట్ కార్యాలయం అధికారులపై ప్రశంసలు కురిపించింది. నవరాత్రి, దుర్గా పూజ పండగల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామంపై కోఎలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా స్పందించింది. అప్రమత్తంగా ఉండాలంటూ ఆలయాల నిర్వాహకులకు సూచించింది. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరింది.
అదే ఆలయంలో రాజా కృష్ణమూర్తి ఫ్యామిలీ పూజలు
కాగా ఈ ఘటన జరిగిన సమయంలో ఇండో-అమెరికన్ కాంగ్రెస్‌మెన్ రాజా కృష్ణమూర్తి తన కుటుంబంతో కలిసి అదే ఆలయంలో పూజలు చేస్తున్నారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. "నా కుటుంబం, నేను ఆదివారం ఆరాలోని మా హిందూ ఆలయంలో ఉండగా ఓ శ్వేతజాతీయుడు భారతీయ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు యత్నించాడు. ఈ మారణహోమం నుంచి కాపాడిన వారికి కృతజ్ఞతలు. శ్వేతజాతి ఆధిపత్య ధోరణులను, ద్వేషాన్ని మనం ఏకం కలిసి ఎదుర్కోవాలి" అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అదేవిధంగా భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా సైతం ఈ దాడిని ఖండించారు. నాగరిక సమాజంలో జాతి వివక్షకు, హిందూ వ్యతిరేక భావాలకు తావులేదని స్పష్టం చేశారు. అమెరికా చట్టసభ సభ్యులు జామీ రాస్కిన్, రిచ్ మెక్కార్మిక్, రో ఖన్నా తదితరులు కూడా స్పందిస్తూ.. మతం లేదా జాతి ఆధారంగా హింసను ప్రేరేపించే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


