చెరసాలలో శాంతి కపోతం! ఎవరీ బియాలియాట్‌ స్కీ, ఈయన చేసిన నేరం ఏంటసలు?

Belarus court jails Nobel Peace Prize winner Ales Bialiatski - Sakshi

అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు ఊహించినట్లే జరిగింది. దేశంలో కల్లోలానికి కారకుడంటూ మానవ హక్కుల ఉద్యమకారుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అలెస్‌ బియాలియాట్‌ స్కీ(60)కు పదేళ్ల జైలు శిక్ష విధించింది బెలారస్‌ న్యాయస్థానం. 

2020లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు  అలెస్‌.. ఆర్థిక సహకారం అందించాడని, తద్వారా ఇతర నేరాలకూ కారకుడయ్యాని ప్రభుత్వం మోపిన అభియోగాలను ధృవీకరించింది కోర్టు. అంతేకాదు ఆ సమయంలో అరెస్టయిన వాళ్లకు న్యాయపరమైన సాయం కూడా అందించాడని నిర్ధారించుకుని.. శుక్రవారం ఆయనకు పదేళ్ల  జైలుశిక్షను ఖరారు చేసింది. 

బియాలియాట్‌ స్కీ.. వియాస్నా మానవ హక్కుల సంఘం సహ వ్యవస్థాపకుడు. శాంతియుత పోరాటాలు నిర్వహిస్తుంది ఈ సంస్థ. 2020లో అలెగ్జాండర్‌ లుకాషెంకో తిరిగి బెలారస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నిరసనలకు బియాలియాట్‌ స్కీ.. ఆయన నిర్వహిస్తున్న ఫౌండేషన్‌ సూత్రధారి అని, నిరసనకారులకు అన్నివిధాలుగా సహకరించారనేది వెల్లువెత్తిన ఆరోపణలు. దీంతో 2021లో ఆయన్ని, వియాస్నా గ్రూప్‌కు చెందిన మరో ఇద్దరు సహవ్యవస్థాపకులనూ బెలారస్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. 

► ఇదిలా ఉండగానే.. 2021 అక్టోబర్‌లో బియాలియాట్‌ స్కీకి నోబెల్‌ శాంతి ప్రైజ్‌(రష్యా మానవ హక్కుల సంస్థతో పాటు ఉక్రెయిన్‌కు చెందిన సంస్థకు సైతం) వరించింది. 

► అలెస్‌ బియాలియాట్‌ స్కీ.. మానవ హక్కుల ఉద్యమకారుడే కాదు.. సాహిత్యకారుడు కూడా. స్కూల్‌ టీచర్‌గా, మ్యూజియం డైరెక్టర్‌గానూ ఆయన పని చేశాడు. 1980 నుంచి బెలారస్‌లో జరుగుతున్న పలు ఉద్యమాల్లో ఆయన భాగం అవుతూ వస్తున్నారు. 

► సోవియట్‌ యూనియన్‌ నుంచి బెలారస్‌ స్వాతంత్రం కోసం ఉద్యమించిన ప్రముఖుల్లో ఈయన కూడా ఉన్నారు.

► 1990లో బెలారస్‌ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 1994లో జరిగిన ఎన్నికల్లో అలెగ్జాండర్‌ లుకాషెంకో అధ్యక్షుడిగా ఎన్నియ్యాడు. అయితే.. అక్కడ పారదర్శకంగా జరిగిన ఎన్నిక అదొక్కటేనని చెప్తుంటారు మేధావులు. ఆపై దొడ్డిదారిలో ఎన్నికవుతూ.. ఇప్పటికీ ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 

► లుకాషెంకో.. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు. రష్యా అండతోనే బెలారస్‌.. పాశ్చాత్య దేశాలపైకి కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉక్రెయిన్‌ విషయంలోనూ రష్యాకు మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో తమ దేశంలో రష్యా బలగాలకు ఆశ్రయం కల్పిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 

► 2020 అలర్లకు సంబంధించి రాజకీయ ఖైదీలకు.. బియాలియాట్‌ స్కీ బహిరంగ మద్దతు ప్రకటించారు. అయితే.. జైల్‌లో వాళ్లు ఎదుర్కొన్న వేధింపులను ఒక డాక్యుమెంటరీ ద్వారా బయటి సమాజానికి తెలియజేశారు. ఆ కోపంలోనే బెలారస్‌ సర్కార్‌ ఆయనపై పగ పెంచుకుని.. ఇబ్బందిపెడుతోందన్నది అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల వాదన. 

► బియాలియాట్‌ స్కీ జైలుకు వెళ్లడం ఇదేం కొత్త కాదు. 2011 నుంచి మూడేళ్లపాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. వియాస్నా గ్రూప్‌ ఫండింగ్‌కు సంబంధించి పన్నుల ఎగవేత నేరంపై అప్పుడు ఆయన శిక్ష అనుభవించారు. అయితే.. ఆ సమయంలోనూ ఆయన నేరారోపణలను ఖండించారు.

► ఇక 2021లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకుగానూ మరోసారి అరెస్ట్‌ కాగా.. అప్పటి నుంచి చెరసాలలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన అరెస్ట్‌ను మానవ హక్కుల సంఘాలు, బెలారస్‌ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బియాలియాట్‌ అరెస్ట్‌ను ప్రభుత్వ ప్రతీకార చర్యగా అభివర్ణించింది. మొత్తం 23 మానవ హక్కుల సంఘాలు ఆయనకు సంఘీభావంగా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. 

► తొలుత 12 ఏళ్ల శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్‌లు వాదించారు. అయితే.. కోర్టు మాత్రం పదేళ్ల శిక్ష విధించింది. ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరికి.. ఒకరికి ఏడు, మరొకరికి 9 ఏళ్ల శిక్షలు ఖరారు చేసింది. అఆగే ముగ్గురికి లక్ష నుంచి 3 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించింది. 

► బియాలియాట్‌ స్కీ జైలు శిక్ష తీర్పుపై బయటి దేశాల నుంచే కాదు బెలారస్‌లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వాదప్రతివాదాలు సహేతుకంగా జరగలేదని విమర్శించారు బెలారస్‌ ప్రతిపక్ష నేత, బహిష్కృత నేత స్వియాట్లానా. మరోవైపు ఆయన అరెస్ట్‌కు ఖండిస్తూ.. సంఘీభావంగా పలు చోట్ల శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top