
బర్కిలీ: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే, బర్కిలీకి సమీపంలో సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. శాన్‌ఫ్రాన్సిస్కో, బర్కిలీతోపాటు అక్కడికి 161 కిలోమీటర్ల దూరంలోని సలినాస్‌లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. తీవ్ర భూప్రకంపనలతో భయంతో నిద్ర నుంచి మేల్కొన్న జనం పరుగుపరుగున ఇళ్లు వదిలి వీధుల్లోకి చేరుకున్నారు.
దుకాణాల షెల్ఫుల్లోని ఉన్న వస్తువులు కింద పడిపోయాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్లు కదులుతున్నట్లుగా ఉన్న వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. భూకంపం కారణంగా కొద్దిసేపు రైళ్లను తక్కువ వేగంతో నడిపారు. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. నష్టం గురించిన సమాచారం కూడా లేదన్నారు. భూకంప కేంద్రం బర్కిలీకి ఆగ్నేయంగా 1.6 కిలోమీటర్ల దూరంలో, సుమారు 7.7 కిలోమీటర్ల లోతులో ఉంది.