ఫైనల్‌ టచ్‌ | Sakshi
Sakshi News home page

ఫైనల్‌ టచ్‌

Published Thu, May 9 2024 10:30 AM

-

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరడంతో జాతీయ నేతలు భాగ్యనగరానికి క్యూ కట్టారు. ఇప్పటికే పలువురు ప్రచారంతో హోరెత్తించగా.. చివరి మూడు రోజుల్లో ఫైనల్‌ టచ్‌ ఇచ్చేందుకు అతిరథ మహారథులు నగరానికి రానున్నారు. గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, శుక్రవారం ప్రధాని మోదీ, శనివారం కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ, బీఆర్‌ఎస్‌ సారథి కేసీఆర్‌ హైదరాబాద్‌లో జరిగే ప్రచార సభల్లో పాల్గొననున్నారు.

ఇదీ వరుస..

● గురువారం సాయంత్రం 6 గంటలకు సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించే జనజాతర సభకు రాహుల్‌గాంధీ హాజరు కానున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎల్‌బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు పటాన్‌చెరులో నిర్వహించే కార్నర్‌ మీటింగ్‌కు ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరు కానున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సైతం చివరి రోజు నగరంలో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు..

గ్రేటర్‌లోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌ సభ స్థానాలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార కాంగ్రెస్‌ సిటింగ్‌ స్థానమైన మల్కాజిగిరితో పాటు గతంలో చేజారిన సికింద్రాబాద్‌, చేవెళ్ల స్థానాలను దక్కించుకునేందుకు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఆయా లోక్‌సభ స్థానాల పరిధిలో రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ నేతలు సైతం అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తాజాగా రాహుల్‌, ప్రియాంకలు రానుండటంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

● ఇక బీజేపీ.. తన సిటింగ్‌ స్థానమైన సికింద్రాబాద్‌తో పాటు మల్కాజిగిరి, హైదరాబాద్‌, చేవెళ్ల లోక్‌సభ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు సైతం నగరంలో విస్త్రృత ప్రచారం నిర్వహించారు. తాజాగా ఈ నెల 10న ప్రధాని మోదీ మళ్లీ నగరానికి రానున్నారు. బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ స్థానమైన చేవెళ్లతో పాటు మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాలను ఆ పార్టీ కీలకంగా తీసుకుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే చేవెళ్ల నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నగరంలో వరుస కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో చివరి రోజైన శనివారం సాయంత్రానికే కేసీఆర్‌ మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు.

నేడు రాహుల్‌.. రేపు మోదీ.. ఎల్లుండి ప్రియాంక

గ్రేటర్‌ బాట పట్టనున్న జాతీయ నేతలు

ప్రచారానికి మిగిలింది ఇక రెండు రోజులే

Advertisement
Advertisement