ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించండి

Jul 7 2025 6:18 AM | Updated on Jul 7 2025 1:23 PM

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): గుంటూరు నగరంలో శంకర్‌ విలాస్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ సిబ్బందికి సూచించారు. ఓవర్‌ బ్రిడ్జి పనుల నేపథ్యంలో చేపట్టిన ట్రాఫిక్‌ మళ్లింపును ఎస్పీ ఆదివారం స్వయంగా పరిశీలించారు. శంకర్‌విలాస్‌ బ్రిడ్జి వద్ద (బ్రాడీపేట వైపు), కంకర గుంట రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద, మూడు వంతెనల మార్గం వద్ద, కొత్తపేట శివాలయం వద్ద చేపట్టిన ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలను పరిశీలించి ట్రాఫిక్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. 

వర్షాకాలంలో కంకరగుంట రైల్వే అండర్‌ బ్రిడ్జి, మూడు వంతెనల మార్గం వద్ద నీరు ఎక్కువగా చేరడం వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ట్రాఫిక్‌ అధికారులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీఎస్పీ ఎం.రమేష్‌, వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ అరవింద్‌, ట్రాఫిక్‌ ఈస్ట్‌, వెస్ట్‌ సీఐలు ఏ.అశోక్‌, సింగయ్య, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్‌, నగరంపాలెం సీఐ నజీర్‌బేగ్‌, అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు, ట్రాఫిక్‌ ఎస్సైలు రవీంద్రబాబు, సాంబశివనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

భారీగా రేషన్‌ బియ్యం స్వాధీనం

ప్రత్తిపాడు: రైస్‌ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపిన ప్రకారం... వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన ఓ రైస్‌ మిల్లులో అక్రమంగా రేషన్‌ బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేశారన్న సమాచారం జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులకు అందింది. ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు సౌత్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జి. భానూదయ, సీఐ రమానాయక్‌, సిబ్బందితో కలిసి మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మిల్లులో రేషన్‌ బియ్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారాన్ని రెవెన్యూ, సివిల్‌ సప్లైస్‌ అధికారులకు తెలియజేశారు. వట్టిచెరుకూరు తహసీల్దార్‌ క్షమారాణి, సివిల్‌ సప్లైస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ శివశంకర్‌లు మిల్లు వద్దకు చేరుకున్నారు. బస్తాల్లో నిల్వ చేసిన సుమారు 60 టన్నులకు పైగా రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

పటాలంలో తొలి ఏకాదశి పూజలు

మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి సంస్థ పరిధిలోని ఆరవ బెటాలియన్‌లో ఆదివారం ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. బెటాలియన్‌ కమాండెంట్‌ మాట్లాడుతూ భక్తులు అమ్మవారికి సారె చీరెలు సమర్పించడం ఆనవాయితీ అని, అమ్మవారి దయతో కుటుంబాలు సంతోషంగా ఉంటాయని నమ్మకం అని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాడెంట్‌ ఆశ్వీరాదం, అధికారులు, స్థానిక మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.

దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణ

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం శివాలయం వీధికి చెందిన మహిళలు ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించారు. శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవాలయంలోని పార్వతీ దేవికి తొలుత సారె సమర్పించి, మేళతాళాలతో కాలినడకన విజయవాడ దుర్గమ్మ వారికి సారె తీసుకెళ్లారు. స్థానిక మహిళలు అమ్మాజి, అనూష, సరళ, స్రవంతి, కౌసల్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించండి 1
1/1

ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement