బంగారం మాయం.. ఉద్యోగి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

బంగారం మాయం.. ఉద్యోగి ఆత్మహత్య

Published Tue, Mar 26 2024 2:00 AM

-

సంస్థలోనే బంగారం ఉన్నట్లు సిబ్బంది ప్రకటన

కొల్లూరు : బంగారం, వెండి వస్తువులు తాకట్టు పెట్టుకుని నగదు లావాదేవీలు నిర్వహించే ఓ ప్రైవేటు సంస్థలో బంగారం మాయం అవడంతో మనస్తాపానికి గురైన ఆ సంస్థ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా తంబడపల్లెకు చెందిన పిన్నెబోయిన బాలశేఖర్‌ (21) డిగ్రీ పూర్తయిన అనంతరం మణప్పురం సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆదరవుగా ఉన్నాడు. గిద్దలూరు, వినుకొండ బ్రాంచ్‌లలో పని చేసిన అతను ఈనెల 12న కొల్లూరు బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్‌పై వచ్చాడు. గతంలో కొల్లూరులో పనిచేసిన మేనేజర్‌ బదిలీ అవడంతో, నూతనంగా వచ్చిన మేనేజర్‌ సంస్థలో బంగారం నిల్వ లెక్క చూసుకునే సమయంలో ఎనిమిది గ్రాములు కనిపించకుండా పోవడంతో బాలశేఖర్‌ ఆందోళనకు గురయ్యాడు. మేనేజర్‌ తిరిగి పరిశీలిద్దాం.. ఉంటుందిలే ! అని నచ్చచెప్పినప్పటికీ, అతని బంధువులకు ఫోన్‌ చేశాడు. వారు కూడా అవసరమైతే నగదు చెల్లిద్దాం ఆందోళన చెందవద్దని సూచించారు. అయితే, ఆ సంస్థ ఆవరణలోనే ఉన్న గదిలో మేనేజర్‌తో కలసి ఉంటున్న బాలశేఖర్‌ 23 అర్ధరాత్రి వాంతులు చేసుకుంటుండటంతో ఆయన ఏమైందని ప్రశ్నించారు. బంగారం పోవడంతో నింద తనపై పడుతుందన్న ఆందోళనతో కలుపు మందు తాగినట్లు తెలపడంతో హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున బాలశేఖర్‌ మృతి చెందాడు. మృతుడి తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, కనిపించకుండా పోయిన ఎనిమిది గ్రాముల బంగారం సంస్థకు చెందిన లాకర్‌లో పేపర్ల కింద ఉన్నట్లు సిబ్బంది తెలిపినట్లు ఏఎస్‌ఐ అర్జున్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement