కార్పొరేట్‌ ఎజెండాకు ఆదివాసీలు బలి! 

Prakash Karath Article On Aborigines - Sakshi

విశ్లేషణ

బిర్సా ముండా జయంతిని పునస్కరించుకుని మోదీ ప్రభుత్వం తాను ఆదివాసీలకు అనుకూలమని చాటుకోవడానికి భారీ ప్రయత్నమే తలపెట్టింది. దీంట్లో భాగంగానే బిర్సా ముండా జయంతిని ఇకనుంచి జనజాతీయ గౌరవ్‌ దివస్‌గా జరుపుకుంటామని కేంద్రం ప్రకటించింది. 2014లో కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆదివాసీలను అడవులనుంచి తరిమేసి వారిని నిలువునా మోసగించడం అనే ప్రక్రియ ఏమాత్రం ఆగకపోగా, మరింత ఎక్కువైంది.

ఒకవైపు ప్రభుత్వ ప్రాయోజిత మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టులు, మరోవైపు ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థల దురాశ కలిసి ఆదివాసీలను వారి సాంప్రదాయిక భూభాగాల నుంచి తరిమివేస్తున్నాయి. ఆదివాసీ ప్రముఖులను ప్రశంసించడం, వారిపేర్లను రైల్వే స్టేషన్లకు పెట్టడం చేస్తూనే, మరోవైపున అడవులపై ఆదివాసీల హక్కును కాలరాస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందుత్వ కార్పొరేట్‌ పరిపాలనా వ్యవస్థకు ఆదివాసీలే బాధితులయ్యారు. 

నవంబర్‌ 15న ఆదివాసీ దిగ్గజ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌లో జరిగిన ఆదివాసీల భారీ ర్యాలీని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారని ఆయన విచారం వెలిబుచ్చారు. ఒక్క తన ప్రభుత్వం మాత్రమే దేశాభివృద్ధిలో ఆదివాసీలను భాగస్తులను చేసి, వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారికి లబ్ధి కలిగిస్తోందని ప్రధాని ఘనంగా చెప్పుకున్నారు.

బిర్సా ముండా జయంతిని పునస్కరించుకుని మోదీ ప్రభుత్వం తాను ఆదివాసీలకు అనుకూలమని ఘనంగా చాటుకుంది. దీంట్లో భాగంగానే బిర్సా ముండా జయంతిని ఇకనుంచి ‘జనజాతీయ గౌరవ్‌ దివస్‌’గా జరుపుకుంటామని కేంద్రం ప్రకటించింది. దీంట్లో భాగంగానే మోదీ భోపాల్‌ లోని హబిబ్‌ గంజ్‌ రైల్వేస్టేషన్‌ పేరును గోండు రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా మార్చింది. అదే రోజున రాంచీలో బిర్సా ముండా, ఆదివాసీ చరిత్రపై మ్యూజియంని కూడా ప్రధాని ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.

చెప్పేదొకటి... చేసేదొకటి!
బిర్సా ముండా జయంతి ఉత్సవాలు నిర్వహించడం, ఆదివాసీ ప్రయోజనాల పరిరక్షణలో తానే చాంపియన్‌ అని ప్రధాని ప్రకటించుకోవడం చూడ్డానికి బాగానే ఉంది కానీ, కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి ఆదివాసీ హక్కులను హరించివేస్తోంది. పైగా దేశంలోని అడవులు, అటవీ భూముల్లో అంతర్భాగంగా ఉంటున్న ఆదివాసీలను, వారి జీవన విధానాన్ని కేంద్ర ప్రభుత్వమే ధ్వంసం చేస్తోంది. ఒకవైపు ప్రభుత్వ ప్రాయోజిత మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టులు, మరోవైపు ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థల దురాశ కలిసి ఆదివాసీలను వారి సాంప్రదాయిక భూభాగాల నుంచి తరిమి వేస్తున్నాయి.

కాంట్రాక్టర్లు ఆదివాసీల ప్రాథమిక, రాజ్యాంగబద్ధ హక్కులను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. గత ప్రభుత్వాల ఆచరణ సరేసరి. కానీ 2014లో కేంద్రంలో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆదివాసీలను అడవులనుంచి తరిమేసి వారిని నిలువునా మోసగించడం అనే ప్రక్రియ ఏమాత్రం ఆగలేదు సరికదా మరింత ఎక్కువైంది. పైగా గనులు, ఖనిజాల అన్వేషణ, రసాయన పరిశ్రమల ద్వారా ప్రైవేట్‌ పెట్టుబడి ప్రకృతి సహజ వనరులను, అటవీ సంపదను కొల్లగొట్టే ప్రక్రియ కూడా మొదలైపోయింది.

అయిదవ, ఆరవ షెడ్యూల్‌ ప్రాంతాల్లో గనుల లీజు, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రామసభల ఆమోదం తప్పనిసరి అనే నిబంధనకు నరేంద్రమోదీ ప్రభుత్వం తూట్లు పొడిచింది. కేంద్రంలో అధికారం స్వీకరించాక మొట్టమొదటగా గనులు, ఖనిజాల (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ చట్టం 2015కి ఆమోదముద్ర వేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011లో ఆమోదించిన సవరణ చట్టంలో ఆది వాసీల హక్కుల రక్షణకు సంబంధించిన నిబంధనలను ఈ కొత్త సవరణ చట్టం తుంగలో తొక్కింది.

అయిదో, ఆరో షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గనుల లీజుకు గ్రామసభల అనుమతి తీసుకోవడం, ఈ ప్రాంతాల్లోని చిన్న స్థాయి ఖనిజ వనరులను మంజూరు చేయడానికి ఆదివాసీ కో ఆపరేటివ్‌లకు అర్హత కల్పించడం, బొగ్గు గని సంస్థలు తమ లాభాల్లో 26 శాతాన్ని జిల్లా ఖనిజాల సంస్థకు ఇవ్వడం అనే అంశాలను ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక్క వేటుతో రద్దు చేసి పడేసింది. 

సకల హక్కులకూ ఆదివాసీలు ఇక దూరం
ఒకవైపు ఆదివాసీ జనాభాతో కూడిన అటవీ ప్రాంతాల్లో గనులు, ఖనిజాల పరిశ్రమలను నెలకొల్పుకోవడానికి లైసెన్స్‌ ఇస్తున్నారు. మరోవైపు అయిదో, ఆరవ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రజల రాజ్యాంగబద్ధ హక్కులను హరించివేస్తున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే భారతీయ అటవీ చట్టం 1927కు ప్రతిపాదించిన సవరణ వల్ల ఆదివాసీ గ్రామ సభల పాత్రను పూర్తిగా తుడిచిపెట్టుకు పోనుంది. దీంతో ఆదివాసీల పరిస్థితి... ఇతర కమ్యూనిటీలతో సరిసమాన స్థితికి దిగజారిపోవడం ఖాయం. పైగా, సాగు చేసుకునే హక్కు, చేపలు పట్టుకునే హక్కు, అటవీ ఉత్పత్తులపై, పశువుల మేతపై హక్కు వంటి ఆదివాసీ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలనూ ఇకనుంచి నేరమయంగా మార్చివేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చిన అటవీ చట్ట సవరణ బిల్లు పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రబలిపోవడంతో ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లభించలేదు. అయితే 2018–2019 ప్రతిపాదిత అటవీ విధానం లేక అటవీ పరిరక్షణ చట్టం 1980కి చేయదలుస్తున్న ఇతర సవరణల కారణంగా తక్షణ ఫలితం ఏమిటంటే, అటవీయేతర ప్రయోజనాల కోసం అటవీ భూములను మళ్లించడం ఇకపై సులభతరం కానుంది. అడవుల ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణపై గ్రామసభ అనుమతి తప్పనిసరి కాగా ఇక ఆ హక్కు లేకుండా చేస్తున్నారు.

కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ మార్పుల కారణంగా అటవీ హక్కుల చట్టం నిబంధనలకే తూట్లుపడబోతోంది. దీర్ఘకాలంగా అడవుల్లోనే నివసిస్తున్నవారికి అటవీ భూముల కల్పన, గిరిజన సమాజాల హక్కును పరిరక్షించడం, ఆది వాసీల సాగు హక్కు, చిన్న చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించుకోవడం వంటివాటిని ఈ అటవీ హక్కుల చట్టం నిలబెడుతూ వచ్చింది.

మొత్తంమీద, మోదీ పాలనలో ఆదివాసీ ప్రజల హక్కులను టోకున హరించివేయడం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఆదివాసీలు, ఆదివాసీ సమాజాలకు అటవీ భూములపై పట్టా కలిగి ఉండే హక్కు, అటవీ భూములను తాము మాత్రమే సాగు చేసుకునే హక్కును ప్రసాదించిన అటవీ హక్కుల చట్టం–2006ని సైతం ఇప్పుడు ఉల్లంఘించేశారు. కేంద్ర ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గిరిజనులు, ఆది వాసీ సమాజాలకు చెందినవారు దరఖాస్తు చేసుకున్న భూ హక్కు ప్రకటనల్లో 46.69 శాతాన్ని మాత్రమే ఆమోదించారు. అంటే 50 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే భూ హక్కు లభించింది. మధ్యప్రదేశ్‌లో అటవీ హక్కుల చట్టం కింద అటవీ భూమిపై హక్కుకు సంబంధించి ఆదివాసీ కుటుంబాలు పెట్టుకున్న దరఖాస్తులను అయిదింట మూడో వంతు వరకు తిరస్కరించారు.

ఆదివాసీ పిల్లల చదువులకు తలుపులు మూశారు
మోదీ పాలనలో ఆదివాసీల సాంఘిక సంక్షేమ చర్యలు ఆదివాసీ పిల్లల దుస్థితికి దృష్టాంతాలుగా నిలిచాయి. 2020 మార్చి నుంచి అంటే కోవిడ్‌ తొలిదశలో లాక్‌డౌన్‌ ప్రకటించాక పాఠశాలలను మూసేశారు. 90 నుంచి 95 శాతంవరకు గ్రామీణ ఆదివాసీ విద్యార్థులు ఎలాంటి విద్యకూ నోచుకోలేదు. అన్‌లైన్‌ విద్య అనే ప్రపంచం ఆదివాసీ పిల్లలకు తలుపులు మూసేసింది. వీరిలో చాలామందికి సంబంధించి విద్యా హక్కు గాలికి కొట్టుకుపోయింది. ఆహార భద్రత కూడా లేకపోవడంతో గ్రామీణ ఆదివాసీ కుటుంబాలు తీవ్రంగా దెబ్బతినిపోయాయి. ఈ కాలంలో ఎక్కువ ఆకలి చావులు ఆదివాసీ కుటుం బాల్లోనే చోటు చేసుకున్నాయి.

ఆదివాసీల పట్ల మోదీ ప్రభుత్వ వైఖరి మితవాద అస్తిత్వ రాజకీయాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఆదివాసీ ప్రముఖులను ప్రశంసించడం, వారిపేర్లను రైల్వే స్టేషన్లకు పెట్టడం సరేసరి. మరోవైపున అటవీభూములపై, అడవులపై వారి హక్కును కాలరాస్తున్నారు. వారి ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందుత్వ కార్పొరేట్‌ పరిపాలనా వ్యవస్థకు ఆదివాసీలే ప్రధాన బాధితులయ్యారు.

వ్యాసకర్త: ప్రకాశ్‌ కారత్‌, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top